ప్రైవేటు ఉద్యోగిని బలిగొన్న దా‘రుణ యాప్‌’

‘రుణ యాప్‌లో అప్పు తీసుకుని తప్పు చేశాను.. ఠంచనుగా డబ్బులు కడుతున్నా అసభ్య పదజాలంతో వేధిస్తున్నారు.. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు ఇలాంటి యాప్‌లపై నిషేధం విధించాలి’ అంటూ

Published : 27 Sep 2022 04:44 IST

వేధింపులే కారణమంటూ బాధితుడి స్పష్టీకరణ

నిజాంపేట, న్యూస్‌టుడే: ‘రుణ యాప్‌లో అప్పు తీసుకుని తప్పు చేశాను.. ఠంచనుగా డబ్బులు కడుతున్నా అసభ్య పదజాలంతో వేధిస్తున్నారు.. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు ఇలాంటి యాప్‌లపై నిషేధం విధించాలి’ అంటూ ఓ వ్యక్తి బలవన్మరణానికి ముందు ఆవేదనతో చేసిన వినతి ఇది. హైదరాబాద్‌ బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం ఈ దారుణం జరిగింది. మృతుడి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా జి.కొండూరు మండలం వెలగలేరుకు చెందిన సి.హెచ్‌.రాజేష్‌(35) పదేళ్ల క్రితం నగరానికి వలసొచ్చారు. ఆయనకు భార్య సునీల, మూడేళ్ల కుమార్తె ఉన్నారు. బాచుపల్లి రాజీవ్‌గాంధీనగర్‌లోని ఆరో టవర్స్‌లో అద్దెకుంటూ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. భార్య ఇటీవల సొంతూరు వెళ్లడంతో ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. సోమవారం మధ్యాహ్నం రాజేష్‌ చిరునామాకు కొరియర్‌ వచ్చింది. అది రాజేష్‌ భార్య పేరిట ఉండటంతో ఆ తెచ్చిన వ్యక్తి ఆమెకు ఫోన్‌ చేశాడు. ఈ క్రమంలో ఆమె తన భర్తకు ఫోన్‌ చేస్తున్నా.. ఎంతకీ ఎత్తకపోవడంతో అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌కు ఫోన్‌ చేసి ఫ్లాట్‌కు వెళ్లి చూడాల్సిందిగా కోరింది. అతను వెళ్లి చూసేసరికి రాజేష్‌ ఉరేసుకుని కనిపించాడు. రాజేష్‌ చనిపోవడానికి ముందు అదే గదిలోని ఓ బోర్డుపై రుణయాప్‌ వేధింపుల కారణంగా తనువు చాలిస్తున్నట్లు రాసిపెట్టి ఉంది. అశ్లీల, గేమింగ్‌ యాప్‌ల మాదిరిగానే ‘రుణ యాప్‌’లను కూడా బ్లాక్‌ చేయాలంటూ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌లను అభ్యర్థిస్తూ ఆ బోర్డుపై ఆయన సూచించారు. అయితే రాజేష్‌ ఏ యాప్‌ నుంచి ఎంత రుణం తీసుకున్నాడనే వివరాలు తెలియరాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని