డబుల్‌ ఇళ్ల పేరిట బురిడీ

కొందరు పేదల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని డబుల్‌ బెడ్రూం ఇళ్ల పేరిట డబ్బులు దండుకున్న ఓ ముఠా పోలీసులకు చిక్కింది. ఆరుగురు నిందితులను

Published : 28 Sep 2022 04:41 IST

నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి సొమ్ముల వసూలు

ఆరుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

మహబూబ్‌నగర్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే: కొందరు పేదల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని డబుల్‌ బెడ్రూం ఇళ్ల పేరిట డబ్బులు దండుకున్న ఓ ముఠా పోలీసులకు చిక్కింది. ఆరుగురు నిందితులను మహబూబ్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి కొంత నగదు.., నకిలీ పట్టాల తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను మంగళవారం జిల్లా ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు వెల్లడించారు. మహబూబ్‌నగర్‌ పట్టణం రాజేంద్రనగర్‌కు చెందిన సయ్యద్‌ హసన్‌ ఎలక్ట్రికల్‌ దుకాణం నడుపుతున్నాడు. పట్టణ సమీపంలోని దివిటిపల్లి వద్ద నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లకు డిమాండ్‌ ఉండటంతో వాటి ద్వారా సంపాదించాలని భావించాడు. అనంతరం ఒక ఒరిజినల్‌ ఇంటి పట్టాను ఫొటో తీసుకున్నాడు. డీటీపీ, స్టాంపుల తయారీలో పట్టున్న అమీర్‌ అనే యువకుడితో 40 నకిలీ పట్టాలు తయారు చేయించాడు. డబ్బులిచ్చిన వారికి ఇళ్లను మంజూరు చేయిస్తానని, సహకరిస్తే వాటా ఇస్తానని మహబూబ్‌నగర్‌.. హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన వెంకటయ్య, వీరన్నపేటకు చెందిన మేహ్రీన్‌, ఇంద్రజలకు చెప్పాడు. వారు 36 మంది నుంచి డబ్బులు వసూలు చేసి నకిలీ పట్టాలిచ్చారు. వీరి నుంచి రూ.67.35 లక్షలు వసూలు చేశారు. అందులోంచి రూ.44.80 లక్షలు హసన్‌ తీసుకున్నాడు. మిగతా రూ.22.55 లక్షలను వెంకటయ్య, మేహ్రీన్‌, ఇంద్రజలు వాడుకున్నారు. డబుల్‌ బెడ్రూం ఇళ్ల పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని, కొందరు ఫోర్జరీ సంతకాలతో నకిలీ ధ్రువపత్రాలను సృష్టించి విక్రయిస్తున్నారని ఈనెల 26న మహబూబ్‌నగర్‌ అర్బన్‌ తహసీల్దార్‌ పార్థసారధి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు సయ్యద్‌ హసన్‌, అమీర్‌, వెంకటయ్య, మేహ్రీన్‌, ఇంద్రజలతో పాటు ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న హసన్‌ దుకాణంలో పనిచేసే జాఫర్‌ను అరెస్టు చేశారు. రూ.13.60 లక్షల నగదు, ప్రింటర్లు, స్కానర్‌, కంప్యూటర్‌, స్టాంపులు, కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న డీఎస్పీ మహేశ్‌, సీఐ రాజేశ్వర్‌గౌడ్‌, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, పురుషోత్తం, పోలీస్‌ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. డబుల్‌ బెడ్రూం ఇళ్ల వ్యవహారంలో సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కొన్ని వాయిస్‌ రికార్డుల విషయమై తాము విచారిస్తున్నామని ఎస్పీ చెప్పారు. త్వరలోనే వాటికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు