అనాథ బాలికపై అత్యాచారం కేసు.. ముగ్గురికి జీవితఖైదు

అనాథ శరణాలయంలో బాలికపై అత్యాచారం.. అనంతరం ఆమె మృతి చెందిన కేసులో ముగ్గురు నిందితులకు సంగారెడ్డి జిల్లా మొదటి అదనపు సెషన్‌ కోర్టు న్యాయమూర్తి సుదర్శన్‌

Updated : 30 Sep 2022 06:25 IST

అమీన్‌పూర్‌, న్యూస్‌టుడే: అనాథ శరణాలయంలో బాలికపై అత్యాచారం.. అనంతరం ఆమె మృతి చెందిన కేసులో ముగ్గురు నిందితులకు సంగారెడ్డి జిల్లా మొదటి అదనపు సెషన్‌ కోర్టు న్యాయమూర్తి సుదర్శన్‌ గురువారం యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అమీన్‌పూర్‌ పట్టణం వెదిరి కాలనీలో చిలుకూరి విజయ అనే మహిళ మారుతి అనాథ శరణాలయం నిర్వహిస్తోంది. ఆశ్రమానికి విరాళాలు ఇచ్చేందుకు ఓ ఔషధ కంపెనీలో పనిచేసే నేరెడ్ల వేణుగోపాల్‌రెడ్డి (53) తరచూ అక్కడికి వచ్చేవాడు. 2019లో అక్కడ ఉన్న బాలికలపై వేణుగోపాల్‌రెడ్డి కన్ను పడింది. విషయాన్ని నిర్వాహకురాలు విజయతో చెప్పాడు. ఆమె అక్కడే డ్రైవర్‌గా పనిచేసే తన సోదరుడు సూరపనేని జయదీప్‌ సహకారంతో 14 ఏళ్ల బాలికకు శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఇవ్వగా.. వేణుగోపాల్‌రెడ్డి అత్యాచారం చేశాడు. అనేకమార్లు అత్యాచారం జరగడంతో బాలిక ఆరోగ్యం క్షీణించింది. తర్వాత కరోనా రావడంతో ఆమెను బంధువుల ఇంటికి పంపించారు. ఆమె విషయాన్ని బంధువులకు చెప్పడంతో 2020 జులై 31న బోయినపల్లిలో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బాలిక నిలోఫర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 12న మృతి చెందింది. తర్వాత కేసును అమీన్‌పూర్‌కు బదిలీ చేయగా, ఇన్‌స్పెక్టర్‌ ప్రభాకర్‌ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పటాన్‌చెరు డీఎస్పీ రాజేశ్వర్‌రావు, శిశు సంక్షేమశాఖ అధికారులు ఆశ్రమాన్ని సందర్శించి 2020 ఆగస్టు 13న నిందితులను అరెస్టు చేశారు. డీఎస్పీ రాజేశ్వరావు ఉద్యోగ విరమణ పొందిన తరువాత నారాయణఖేడ్‌ డీఎస్పీ సత్యనారాయణరాజు దర్యాప్తు చేశారు. విచారణ అనంతరం జిల్లా మొదటి అదనపు సెషన్‌ కోర్టు న్యాయమూర్తి సుదర్శన్‌ తుది తీర్పును గురువారం వెల్లడించారు. నిందితులు వేణుగోపాల్‌రెడ్డి, విజయ, జయదీప్‌లకు జీవితఖైదుతో పాటు జరిమానాలు కూడా విధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని