ఐటీ శాఖ మాజీ అధికారి ఆస్తుల జప్తు

ఆదాయపు పన్ను (ఐటీ) శాఖలో పనిచేసి నిర్బంధ పదవీ విరమణ చేసిన.. రాష్ట్రానికి చెందిన ఓ మాజీ అధికారి ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ప్రాథమికంగా జప్తు చేశారు. ఈ ఆస్తుల విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ. 7.33 కోట్లుగా లెక్కగట్టారు.

Updated : 04 Oct 2022 04:13 IST

వాటి విలువ రూ. 7.33 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: ఆదాయపు పన్ను (ఐటీ) శాఖలో పనిచేసి నిర్బంధ పదవీ విరమణ చేసిన.. రాష్ట్రానికి చెందిన ఓ మాజీ అధికారి ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ప్రాథమికంగా జప్తు చేశారు. ఈ ఆస్తుల విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ. 7.33 కోట్లుగా లెక్కగట్టారు. ఈమేరకు అధికారులు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన అందాసు రవీందర్‌ చెన్నై ఐటీ శాఖలో అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్నప్పుడు 2011 ఆగస్టు నెలలో ఓ ప్రైవేటు సంస్థ నుంచి రూ. 50 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకి దొరికిపోయారు. అనంతరం దర్యాప్తు సంస్థ అధికారులు చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరులలో సోదాలు నిర్వహించి.. అతను ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. దీనిపై ఈడీ అధికారులు మరో కేసు నమోదు చేసి నిధుల మళ్లింపు కోణంలో దర్యాప్తు చేపట్టారు. 2005 జనవరి 1 నుంచి 2011 ఆగస్టు 28 మధ్యకాలంలో రవీందర్‌ రూ. 2,32,20,296 మేర ఆదాయానికి మించిన ఆస్తులను సంపాదించినట్లు గుర్తించారు. ఈమేరకు ఐదు స్థిరాస్తులు సమకూర్చుకున్నట్లు, వాటి విలువ ప్రస్తుత మార్కెట్‌లో రూ.7.33 కోట్లు ఉన్నట్లు ఈడీ అధికారులు లెక్కగట్టారు. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) ప్రకారం ఈ ఆస్తులను ప్రాథమికంగా జప్తు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని