Wanaparthy: నాన్నా.. ఇంత ఘోరమా?

కన్నబిడ్డకు ముల్లు గుచ్చుకుంటేనే తల్లిదండ్రుల మనసులు తల్లడిల్లిపోతాయి. కాస్త నలత చేస్తేనే వారు తట్టుకోలేరు. నయమయ్యేదాకా మామూలు మనుషులు కాలేరు.

Updated : 26 Oct 2022 10:36 IST

పదిహేనేళ్ల కుమార్తెను గొడ్డలితో నరికి చంపిన తండ్రి

వనపర్తి జిల్లాలో దారుణం

పెబ్బేరు, న్యూస్‌టుడే: కన్నబిడ్డకు ముల్లు గుచ్చుకుంటేనే తల్లిదండ్రుల మనసులు తల్లడిల్లిపోతాయి. కాస్త నలత చేస్తేనే వారు తట్టుకోలేరు. నయమయ్యేదాకా మామూలు మనుషులు కాలేరు. అలాంటిది ఓ తండ్రే పదిహేనేళ్ల కుమార్తెను గొడ్డలితో నరికి దారుణంగా చంపాడు. ఒకటికాదు..రెండు కాదు..ఏకంగా ఎనిమిది సార్లు వేటువేశాడు. తీవ్రంగా గాయపడిన బాలిక రక్తపుమడుగులో కుప్పకూలి అక్కడికక్కడే మరణించింది. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన ఈ హత్య సంచలనం రేపింది. తాను వద్దని చెప్పినా వినకుండా ఒక అబ్బాయితో స్నేహంగా ఉండటమే ఆ తండ్రి ఆగ్రహానికి కారణమైంది. వనపర్తి డీఎస్పీ ఆనంద్‌రెడ్డి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పాతపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయదారుడు రాజశేఖర్‌, సునీత, దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. చిన్నకుమార్తె గీత (15) పెబ్బేరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. గ్రామానికి  చెందిన ఓ యువకుడితో బాలిక సన్నిహితంగా మెలగడాన్ని తండ్రి రాజశేఖర్‌ గుర్తించి పలుమార్లు మందలించాడు. కుటుంబ పరువు పోగొట్టవద్దని..బుద్ధిగా చదువుకోవాలని చెప్పాడు. మంగళవారం బాలిక తల్లి పొలం పనులకు వెళ్లారు. మరో కుమార్తె, కుమారుడు కూడా ఇంట్లో లేరు.ఈ సమయంలో ఇంట్లోనే ఉన్న తండ్రి మరోమారు కుమార్తెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురై, విచక్షణ కోల్పోయిన తండ్రి కుమార్తె మెడపై గొడ్డలితో దాడిచేశాడు. దాంతో గీత తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలొదిలింది. అనంతరం పోలీసుస్టేషన్‌లో తండ్రి లొంగిపోయినట్లు సమాచారం. డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, ఆత్మకూరు సీఐ కేఎస్‌.రత్నం, ఎస్సైలు రామస్వామి, వహీద్‌ అలీబేగ్‌లు హత్య జరిగిన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని డీఎస్పీ ఆనంద్‌రెడ్డి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని