కారులో మరో మహిళతో ఇన్‌స్పెక్టర్‌

హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైం స్టేషన్‌ (సీసీఎస్‌)లో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రాజు అర్ధరాత్రి ఓ మహిళతో ఏకాంతంగా గడుపుతూ అడ్డంగా దొరికిపోయాడు.

Updated : 05 Nov 2022 06:50 IST

హైదరాబాద్‌ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజు నిర్వాకం
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

ఈనాడు, హైదరాబాద్‌, వనస్థలిపురం, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైం స్టేషన్‌ (సీసీఎస్‌)లో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రాజు అర్ధరాత్రి ఓ మహిళతో ఏకాంతంగా గడుపుతూ అడ్డంగా దొరికిపోయాడు. దీన్ని బట్టబయలు చేసిన భార్య, ఇతర కుటుంబ సభ్యులతో అతను గొడవ పడుతుండగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడికి దిగాడు. ఈ వ్యవహారం పోలీసుశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్‌స్పెక్టర్‌ రాజుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. బీఎన్‌రెడ్డినగర్‌లో నివాసముంటున్న ఆయన మునుగోడు ఉపఎన్నిక విధుల్లోనూ పాల్గొన్నారు. విధులు ముగిశాక నేరుగా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన భార్య, కుటుంబ సభ్యులు ఆయన కదలికలపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే గురువారం అర్ధరాత్రి వనస్థలిపురంలోని సాగర్‌ రహదారిపై సాగర్‌ కాంప్లెక్స్‌ దాటిన తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో ఓ మహిళతో కారులో రాజు ఏకాంతంగా ఉన్నట్లు గుర్తించారు. 

నేను ఇన్‌స్పెక్టర్‌ని.. నన్నే వీడియో తీస్తావా..!

రాజు మరో మహిళతో ఉండడాన్ని చూసిన భార్య, కుటుంబ సభ్యులు ఆయనతో గొడవకు దిగారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో అరుపులు వినిపించడంతో గస్తీలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కానిస్టేబుల్‌ రామకృష్ఱ, హోంగార్డు నాగరాజు నాయుడులు ఈ గొడవను వీడియో తీసేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన రాజు.. ‘‘నేను ఇన్‌స్పెక్టర్‌ను.. నన్నే వీడియో తీస్తావా..’’అంటూ ఆగ్రహంతోఊగిపోయాడు. అసభ్యంగా మాట్లాడుతూ దాడికి దిగాడు. కానిస్టేబుల్‌ రామకృష్ణ ముఖంపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఈ విషయాన్ని ఆయన ఉన్నతాధికారులకు చెప్పడంతో మరో వాహనంలో వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్‌తో పాటు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న ఇన్‌స్పెక్టర్‌ రాజు, మహిళ, కుటుంబసభ్యులను ఠాణాకు తరలించారు. రాజుకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్ష చేసేందుకు ప్రయత్నించినా సహకరించలేదు. శుక్రవారం ఉదయం రక్త పరీక్ష కోసం నమూనాలు సేకరించారు. కానిస్టేబుల్‌ రామకృష్ణ, హోంగార్డు నాగరాజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. భర్త వ్యవహారంపై ఇచ్చిన ఫిర్యాదును ఆయన భార్య వెనక్కి తీసుకున్నారని చెప్పారు.

రాజు వ్యవహారశైలి.. తొలి నుంచీ వివాదాస్పదమే..!

కారులో ఓ మహిళతో దొరికిపోయి.. విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడికి దిగిన ఇన్‌స్పెక్టర్‌ రాజు వ్యవహారశైలి తొలి నుంచి వివాదాస్పదమే. ఏ పోస్టులో ఉన్నా ఆయన వ్యవహార శైలి ఇబ్బందికరంగా ఉంటుందంటున్నారు. ఆయనపై మొత్తం 10 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో కొన్ని క్రిమినల్‌ కేసులు కూడా ఉన్నాయి. రాజు ప్రవర్తనతో విసిగిపోయిన ఉన్నతాధికారులు కొందరు ఆయనపై చర్యలకు సిఫారసు చేసినట్లు సమాచారం. ఈ లోగానే ఆయనపై తాజాగా కేసు నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని