icon icon icon
icon icon icon

స్వతంత్ర అభ్యర్థులకు ‘గాజు గ్లాసు’.. ఈసీ నిర్ణయంపై హైకోర్టులో జనసేన పిటిషన్‌

ఏపీలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్‌ గుర్తు కేటాయింపుపై హైకోర్టులో జనసేన పిటిషన్‌ వేసింది.

Updated : 30 Apr 2024 12:39 IST

అమరావతి: స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో జనసేన పిటిషన్‌ వేసింది. తమకు కేటాయించిన గాజు గ్లాసును ఇతర అభ్యర్థులకు కేటాయించొద్దంటూ ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ఈ పిటిషన్‌లో కోరారు. ఈ గుర్తును ఫ్రీ సింబల్ నుంచి తొలగించాలని ఈసీకి వినతి పత్రం ఇచ్చామని ఆ పార్టీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రెండోసారి కూడా వినతిపత్రం ఇచ్చినా ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోలేదన్నారు. తెదేపా, భాజపాతో జనసేన పొత్తులో ఉన్న కారణంగా.. ఈ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించటం వల్ల కూటమికి నష్టం వస్తుందన్నారు. మరోవైపు జనసేన ఇచ్చిన అభ్యర్ధనపై 24 గంటల్లో ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.  ఈ వ్యాజ్యంలో తెదేపా సైతం వాదనలు వినిపించేందుకు అనుబంధ పిటిషన్ వేసింది.

జనసేన పోటీలో లేనిచోట స్వతంత్రులకు ‘గాజు గ్లాసు’ గుర్తు

జనసేన పోటీలో లేని పలు శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం ‘గాజు గ్లాసు’ గుర్తు కేటాయించింది. తెదేపా, భాజపాతో పొత్తుల్లో భాగంగా జనసేన 21 శాసనసభ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీచేస్తోంది. ఆ పార్టీ బరిలో లేని నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్‌ జాబితాలో పెట్టి, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది. ఎన్డీయే కూటమి ఓటర్లలో గందరగోళం సృష్టించి, ఓట్లు చీల్చేందుకు వైకాపాయే ఈ కుట్రకు తెరలేపిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img