Sex Scandal Row: అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్‌పై సస్పెన్షన్ వేటు

కర్ణాటక రాజకీయాల్లో అభ్యంతరకర వీడియోలపై దుమారం రేగడంతో.. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)పై వేటుపడింది. 

Updated : 30 Apr 2024 13:12 IST

బెంగళూరు: హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు కన్నడ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అదే సమయంలో జేడీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ప్రజ్వల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ కోర్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

ఇదిలా ఉంటే..ఈ పరిణామానికి ముందు ప్రజ్వల్ బాబాయ్, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి. కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ వివాదం వెనక కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ హస్తం ఉందని ఆరోపించారు. వెంటనే ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ‘‘ఆ వీడియోల్లో ప్రజ్వల్ ముఖం కనిపిస్తోందా..? అవి అతడివేనన్న ఆధారం ఏంటి..? అయినా సరే నైతికత ఆధారంగా చర్యలు ఉంటాయి’’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై సిట్‌ దర్యాప్తు చేస్తోందన్న మాజీ సీఎం.. వీడియో క్లిప్పులు ఉన్న పెన్‌డ్రైవ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు పంపిణీ చేశారనే విషయాలపైనా దర్యాప్తు సాగాలన్నారు.

ప్రజ్వల్‌ రాజకీయ భవితపై నీలినీడలు

‘‘అసలు ఈ వీడియోల వెనక ఉన్నది ఎవరు? వారు స్త్రీల పరిరక్షకులా? అలాగే తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు’’ అని అన్నారు. ప్రజ్వల్‌పై అభియోగాలు వాస్తవమని తేలితే చట్టప్రకారం శిక్ష తప్పదని గతంలో వెల్లడించారు. కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలను ప్రస్తావించిన ఆయన.. భాజపాకు, ప్రధాని మోదీకి ఈ కేసుతో సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఇక దేవేగౌడకు, తనకూ ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని