Crime News: ప్రియురాలిని 35 ముక్కలుగా నరికేశాడు

దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకొంది! తనను నమ్మి.. సొంత కుటుంబాన్ని విడిచి వచ్చి.. సహజీవనం చేస్తున్న యువతిని ఆమె ప్రియుడు అత్యంత కిరాతకంగా గొంతుకోసి హత్య చేశాడు. అక్కడితో ఆగలేదు. ఆమె శవాన్ని 35 ముక్కలుగా చేసి, ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. 18 రోజుల పాటు..

Updated : 15 Nov 2022 10:11 IST

18 రోజులపాటు వాటిని ఫ్రిజ్‌లో దాచి, దిల్లీలోని వేర్వేరు చోట్ల విసిరేశాడు

దిల్లీ: దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకొంది! తనను నమ్మి.. సొంత కుటుంబాన్ని విడిచి వచ్చి.. సహజీవనం చేస్తున్న యువతిని ఆమె ప్రియుడు అత్యంత కిరాతకంగా గొంతుకోసి హత్య చేశాడు. అక్కడితో ఆగలేదు. ఆమె శవాన్ని 35 ముక్కలుగా చేసి, ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. 18 రోజుల పాటు.. రాత్రి వేళల్లో వాటిని దిల్లీలోని వివిధ నిర్మానుష్య ప్రాంతాల్లో విసిరేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె పదేపదే కోరడం వల్లే అతడు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ముంబయిలో ప్రారంభమైన ప్రేమకథ

ముంబయికి చెందిన అఫ్తాబ్‌ అమీన్‌ పూనావాలాకు అక్కడే కాల్‌ సెంటర్‌లో పనిచేసే 26 ఏళ్ల శ్రద్ధా వాకర్‌తో పరిచయమైంది. అది వారి మధ్య చనువుగా, ప్రేమగా మారింది. కలిసి జీవించాలనుకుని సహజీవనం ప్రారంభించారు. తమ బంధాన్ని పెద్దలు అంగీకరించకపోవడంతో, ఇద్దరూ దిల్లీకి వెళ్లిపోయి, మెహ్‌రౌలీ ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లో అద్దెకు దిగారు. అయితే పెళ్లి విషయమై వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే మే 18న శ్రద్ధాను అమీన్‌ హత్య చేశాడు. తర్వాత మృతదేహాన్ని 35 ముక్కలుగా కోసి, వాటిని ఫ్రిజ్‌లో దాచాడు. ఇందుకు ప్రత్యేకంగా 300 లీటర్ల ఫ్రిజ్‌ను కొన్నాడు. దుర్వాసన రాకుండా రూమ్‌ ఫ్రెష్‌నర్లను, అగరబత్తీలను వినియోగించాడు. మాంసపు ముక్కలను 18 రోజులపాటు ఫ్రిజ్‌లోనే ఉంచి.. అర్ధరాత్రి 2 గంటలకు వాటిలో కొన్నింటిని సంచుల్లో వేసుకుని దిల్లీలోని పలు ప్రాంతాల్లో విసిరేసేవాడు. అలా మృతదేహం కానరాకుండా, జాడ లేకుండా చేశాడు.

ఫోన్‌ కాల్స్‌కు స్పందించకపోవడంతో

శ్రద్ధాకు ఆమె కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో వారికి అనుమానం మొదలైంది. ఆమె తండ్రి ఈనెల 8న దిల్లీలోని తన కుమార్తె ఉండే ఫ్లాట్‌కు వెళ్లగా తాళం వేసి ఉంది. శ్రద్ధాను అమీన్‌ తరచూ కొట్టేవాడని, రెండు నెలలుగా ఆమె ఫోన్‌ పనిచేయడం లేదని, తమకూ కనిపించలేదని వారి స్నేహితులు కొందరు చెప్పారు. దీంతో ఆయన వెంటనే పోలీసులను ఆశ్రయించారు. విచారణ సమయంలో అమీన్‌ విస్తుపోయే విషయాలను వెల్లడించాడు. పెళ్లి చేసుకోవాలని పదే పదే ఒత్తిడి చేయడం వల్లే శ్రద్ధాను తాను హత్య చేసినట్టు తెలిపాడు. మృతదేహం ఆనవాళ్ల కోసం తమ సిబ్బంది గాలిస్తున్నట్టు దక్షిణ జిల్లా అదనపు డీసీపీ-1 అంకిత్‌ చౌహాన్‌ తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన దిల్లీ మహిళా కమిషన్‌.. అమీన్‌ను కఠినంగా శిక్షించాలని పోలీసులకు సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు