Kshatriya community: ‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి

నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో అత్యంత క్లిష్ట దశను ఎదుర్కొంటున్నానని కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా (Parshottam Rupala) పేర్కొన్నారు.

Published : 08 May 2024 19:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్షత్రియ వర్గానికి చెందిన మాజీ పాలకులను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా (Parshottam Rupala) మరోసారి క్షమాపణలు చెప్పారు. ఇటీవల నెలకొన్న వివాదంతో తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో అత్యంత క్లిష్ట దశను ఎదుర్కొంటున్నానని అన్నారు. గుజరాత్‌లో లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) ముగిసిన మరుసటిరోజు ఈవిధంగా స్పందించారు. క్షత్రియ వర్గానికి కేంద్రమంత్రి ఇలా క్షమాపణలు చెప్పడం నాలుగోసారి కావడం గమనార్హం.

‘‘నేను చేసిన ఒక్క ప్రకటన.. ఎన్నికల్లో పెద్ద ప్రకంపనలు సృష్టించింది. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో అత్యంత కష్టతరమైన సమయాన్ని ఎదుర్కొంటున్నా. ఈ తప్పిదానికి పూర్తిగా నాదే బాధ్యత అయినప్పటికీ పార్టీ మొత్తం వివాదంలో చిక్కుకుపోయింది. నా వల్ల పార్టీతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నష్టం వాటిల్లడం బాధాకరం. పోలింగ్‌కు ముందు క్షమాపణలు చెప్పా. ఎన్నికలు ఉన్నందున అలా చెప్పి ఉంటానని ప్రజలు భావించవచ్చు. క్షత్రియ సమాజం మొత్తానికి మరోసారి క్షమాపణలు చెబుతున్నా. ఇది రాజకీయ ప్రేరేపితమైంది కాదు’ అని కేంద్ర మంత్రి రూపాలా వేడుకున్నారు.

‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా కన్పిస్తారు..’: మరో వివాదంలో శామ్‌ పిట్రోడా

బ్రిటిష్‌తోపాటు విదేశాల పాలకుల ముందు తలవంచారని.. ఆ తర్వాత వారితో స్నేహపూర్వక సంబంధాలు నెరిపారంటూ క్షత్రియ పాలకులను ఉద్దేశిస్తూ కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాజ్‌పూత్‌ మహిళలైతే ఏకంగా భాజపా కార్యాలయానికి వచ్చి ఆత్మాహుతి చేసుకుంటామని హెచ్చరించారు. రూపాలా నామినేషన్‌ను రద్దు చేయాలని డిమాండు చేశారు. ఈ క్రమంలో క్షత్రియ వర్గాన్ని బుజ్జగించేందుకు కాషాయ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఎటువంటి ప్రకటన రాలేదు. దీంతో కేంద్రమంత్రి మరోసారి క్షమాపణలు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని