impact player: ఇంపాక్ట్‌ అవసరమా! వద్దంటున్న మాజీలు.. వచ్చే సీజన్‌లో ఉంటుందా?

క్రికెట్‌ ఆట ఆడేది పదకొండు మందే.. కానీ ఒక ఆటగాడిని జట్టులోకి అదనంగా చేర్చుకుని బౌలింగ్, బ్యాటింగ్‌లోనూ ఉపయోగించుకోవడమే ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన (impact player rule). 

Updated : 08 May 2024 18:25 IST

క్రికెట్‌ ఆట ఆడేది పదకొండు మందే.. కానీ ఒక ఆటగాడిని జట్టులోకి అదనంగా చేర్చుకుని బౌలింగ్, బ్యాటింగ్‌లోనూ ఉపయోగించుకోవడమే ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన (impact player rule). గతేడాది ఐపీఎల్‌లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ రూల్‌.. ఈ సీజన్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నిబంధన అసలైన క్రికెట్‌ స్ఫూర్తిని దెబ్బతీస్తోందని.. దీనివల్ల ఆటగాళ్లకు అన్యాయం జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. 12 మంది ఆటగాళ్లు తుది జట్టులో ఉండటం వల్ల కొంతమంది ఆటగాళ్లకు అవకాశాలు రాకుండా పోతున్నాయని మాజీలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఐపీఎల్‌ 17 (IPL) ఈవిషయాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపెడుతోంది.

ఆల్‌రౌండర్లకు శాపం

మిగిలిన ఆటగాళ్లకు ఎలాఉందో కానీ, ఇంపాక్ట్‌ రూల్‌ వల్ల ఆల్‌రౌండర్లపై పెనుప్రభావం పడుతోంది. మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు ఆల్‌రౌండర్‌ని ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దించుతోంది. దీంతో అతడికి బౌలింగ్‌ చేసే అవకాశం ఉండట్లేదు. శివమ్‌ దూబె (Shivam Dube), వాషింగ్టన్‌ సుందర్‌ ఇందుకు ఉదాహరణ. దీనివల్ల భారత జట్టు ఎంపికపై కూడా ప్రభావం పడుతోంది. నిజానికి టీ20 ప్రపంచకప్‌లో శివమ్‌ దూబెకు అవకాశం వచ్చేదే కాదు. కానీ మిడిల్‌ ఓవర్లలో చెన్నై తరఫున అదరగొట్టాడన్న ఏకైక కారణంతో ఆల్‌రౌండర్‌ కోటాలో చోటు దక్కించుకున్నాడు. అయితే ఐపీఎల్‌-17లో అతడు బౌలింగ్‌లో సత్తా చాటిందే లేదు. దీనివల్ల రింకు సింగ్‌ (Rinku Singh) లాంటి ఫామ్‌లో ఉన్న ఆటగాడికి అన్యాయం జరిగింది.

మిడిల్‌ ఓవర్లలో మెరుపులు మెరిపించే అవకాశం దూబెకు ఇవ్వడంతో రింకు రిజర్వ్‌ ఆటగాడిగానే మిగిలిపోయాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ పేరుతో అదనపు బ్యాటర్‌ని తీసుకోవడం వల్ల ఈ ఐపీఎల్‌లో రింకును కోల్‌కతా జట్టు ఫినిషర్‌గా ఉపయోగించుకుంది. కానీ వెంకటేశ్‌ అయ్యర్, అంగ్‌క్రిష్‌ రఘువంశీ లాంటి హిట్టర్లు ఉండడంతో చాలా మ్యాచ్‌ల్లో వాళ్లే ఆటను ఫినిష్‌ చేశారు. దీంతో ఎక్కడో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మూలన ఉన్న రింకు పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. కొన్ని బంతులు మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. ఆ కొద్దిపాటి సమయంలో అతడు నిరూపించుకోవడానికి ఏమీ లేకపోయింది. ఇది కూడా రింకు టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోవడానికి ఓ కారణంగా కనిపిస్తోంది. 

బౌలర్లకు కష్టకాలం

ఇంపాక్ట్‌ రూల్‌ ఆల్‌రౌండర్లపై ప్రభావం చూపించడమే కాదు బౌలర్ల కష్టాలను మరింత పెంచింది. ఇప్పటికే చిన్న మైదానాల్లో పవర్‌ హిట్టింగ్‌ వల్ల భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. ఈ ఐపీఎల్‌ సీజన్లో 200 పరుగులు చాలాసార్లు స్కోరు అయ్యాయి. బ్యాటర్లు ధనాధన్‌ షాట్లతో చెలరేగుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై అదనపు బ్యాటర్‌ ఉంటే బౌలింగ్‌ చేసే జట్టుకి మరింత ఇబ్బందికరం. ఒక బ్యాటర్‌ విఫలమైనా లోతైన బ్యాటింగ్‌ లైనప్‌ కారణంగా మిగిలిన బ్యాటర్లు బౌలర్ల పని పడుతున్నారు. స్టేడియాల సైజు సరిపోవట్లేదన్న అశ్విన్‌ మాటలను బట్టే బౌలర్లకు ఎంత కష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

నిజానికి బౌలర్‌ కన్నా బ్యాటర్‌గానే ఇంపాక్ట్‌ ప్లేయర్లు ఉపయోగపడుతున్నారు. లోతైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉండడం వల్ల ముందుగా వచ్చే బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడుతున్నారు. అందుకే భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) సైతం ఇంపాక్ట్‌ నిబంధన తనకు నచ్చలేదనే చెప్పేశాడు. అతడొక్కడే కాదు చాలామంది మాజీ ఆటగాళ్లు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. క్రికెట్‌ అంటే 11 మంది ఆడే ఆట అని అదనంగా మరో ఆటగాడిని చేర్చితే దానికి విలువ ఉండదంటున్నారు. మరి ఇలాంటి విమర్శల నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ఉంటాడో, లేదో చూడాలి. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని