అనిశాకు చిక్కిన జహీరాబాద్‌ కమిషనర్‌

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పురపాలక కార్యాలయంలో బుధవారం సాయంత్రం అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు దాడి చేశారు.

Updated : 24 Nov 2022 04:42 IST

 లంచం తీసుకుంటూ పట్టుబడిన మేనేజర్‌, ఉద్యోగి
 రూ.2 లక్షలు స్వాధీనం

జహీరాబాద్‌, న్యూస్‌టుడే: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పురపాలక కార్యాలయంలో బుధవారం సాయంత్రం అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు దాడి చేశారు. రూ.2 లక్షల లంచం తీసుకున్నట్లు గుర్తించి కమిషనర్‌, మేనేజర్‌తో పాటు ఒక ఒప్పంద ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు. మెదక్‌ రేంజ్‌ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... జహీరాబాద్‌కు చెందిన ఎండి.నిస్సార్‌ అహ్మద్‌ గతంలో అల్లీపూర్‌ ప్రాంతంలోని బ్యాంకు కాలనీలో ఇంటిని కొనుగోలు చేశారు. ఆ ఇంటికి మ్యూటేషన్‌ చేయాలని జూన్‌ 8న దరఖాస్తు చేసుకున్నారు. దీనిని పరిశీలించిన కమిషనర్‌.. ఆన్‌లైన్‌లో ఇల్లు ఇద్దరి పేరిట ఉందని, రూ.2.50 లక్షలు ఇస్తే దానిని సరిచేస్తామని మేనేజర్‌ మనోహర్‌ ద్వారా చెప్పించినట్లు నిస్సార్‌ అహ్మద్‌ అనిశా అధికారులకు తెలిపారు. బుధవారం ఉదయం మరోసారి మాట్లాడగా రూ.2 లక్షలకు అంగీకరించి, ఆ నగదును ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగి రాకేశ్‌ ద్వారా తెప్పించుకొంటుండగా దాడి చేసి పట్టుకున్నట్లు డీఎస్పీ వివరించారు. కమిషనర్‌ డి.సుభాష్‌రావు, మేనేజర్‌ మనోహర్‌, ఒప్పంద ఉద్యోగి రాకేశ్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో అనిశా సీఐలు రమేశ్‌, వెంకటరాజగౌడ్‌లతోపాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

మేనేజర్‌ ఇంట్లోనూ సోదాలు...

బండ్లగూడజాగీర్‌: గండిపేట మండలం బండ్లగూడ జాగీర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కిస్మత్‌పూర్‌ సాయిబాబా కాలనీలో నివాసం ఉంటున్న జహీరాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయం మేనేజరు గౌరిశెట్టి మనోహర్‌ ఇంట్లోనూ అనిశా అధికారులు సోదా నిర్వహించారు. అవినీతి ఆరోపణలపై గతంలోనూ ఆయన సస్పెండయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని