బ్యాంకు రుణం ఎగవేత కేసు.. పది మందికి జైలుశిక్ష, జరిమానా

బ్యాంకుకు రుణం ఎగవేత కేసులో సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానం బుధవారం 10 మందికి జైలుశిక్షతోపాటు జరిమానా విధించింది.

Published : 24 Nov 2022 04:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: బ్యాంకుకు రుణం ఎగవేత కేసులో సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానం బుధవారం 10 మందికి జైలుశిక్షతోపాటు జరిమానా విధించింది. వివరాలిలా ఉన్నాయి. 2012-13లో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర సికింద్రాబాద్‌ బ్రాంచ్‌ నుంచి 6 కంపెనీలకు రుణం మంజూరయింది. తప్పుడుపత్రాలతో ఆ కంపెనీలు బ్రాంచ్‌ సీనియర్‌ మేనేజర్‌ శరత్‌బాబు జెల్లితో కుమ్మక్కై రూ.5 కోట్ల రుణం పొందాయి.  ఆ రుణం ఎగ్గొట్టడంతో బ్యాంకుకు సుమారు రూ.4.57 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ వ్యవహారంపై 2013 మార్చి 30న కేసు నమోదు కాగా.. సీబీఐ 2014 ఆగస్టు 27న అభియోగపత్రం దాఖలు చేసింది. కేసును విచారించిన సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తీర్పును వెలువరించింది. శరత్‌బాబుతోపాటు బ్యాంకు అప్పటి అసిస్టెంట్‌ మేనేజర్‌ సుహాస్‌ కల్యాణ్‌ రాందాసికి ఏడేళ్ల జైలుశిక్ష, రూ.1.1 లక్షల చొప్పున జరిమానా విధించింది. ప్రైవేటు వ్యక్తులు.. దొనికెన శ్రీధర్‌, పూర్ణశ్రీ, మారెల్ల శ్రీనివాసరెడ్డిలకు ఏడేళ్ల చొప్పున జైలుశిక్ష, రూ.లక్ష వంతున జరిమానా విధించింది. మారెల్ల లక్ష్మారెడ్డికి ఏడాది జైలు, రూ. 20 వేల జరిమానా; వెంపటి శ్రీనివాస్‌, వెట్టే రాజారెడ్డిలకు మూడేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా; వడ్డే నర్సయ్య, బత్తుల సత్యసూరజ్‌రెడ్డిలకు మూడేళ్ల జైలుశిక్ష, రూ.20 వేల జరిమానా విధించింది. మావెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రై.లిమిటెడ్‌, గ్రౌపెల్‌ ఫార్మా ప్రై.లిమిటెడ్‌, కాన్‌ఫెర్రో హెల్త్‌ ప్రై.లిమిటెడ్‌లకు రూ.లక్ష చొప్పున, హైదరాబాద్‌ టాబ్లెట్‌ టూల్స్‌, కిరణ్‌ ఇంపెక్స్‌, శ్రీవైష్ణవి ఫార్మా కెమ్‌కు రూ.50 వేల చొప్పున జరిమానా విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని