డిప్యూటీ కలెక్టర్‌నంటూ వసూళ్లు

డిప్యూటీ కలెక్టర్‌గా చెప్పుకొంటూ ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తానని రూ.3 కోట్లు వసూళ్లు చేసిన వ్యక్తిని బాధితులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

Published : 26 Nov 2022 06:56 IST

నిందితున్ని పట్టుకొని పోలీసులకు అప్పగించిన బాధితులు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: డిప్యూటీ కలెక్టర్‌గా చెప్పుకొంటూ ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తానని రూ.3 కోట్లు వసూళ్లు చేసిన వ్యక్తిని బాధితులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధితులు, కృష్ణా జిల్లా గన్నవరం పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ చిట్టినగర్‌కు చెందిన పిళ్లా వెంకటరాజేంద్ర గతంలో సీఆర్‌డీఏలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేశాడు. అవినీతి ఆరోపణలు రావడంతో ఉన్నత ఉద్యోగులు విధుల నుంచి తప్పించారు. అనంతరం క్రికెట్‌ బెట్టింగ్‌లు, జల్సాలకు అలవాటు పడిన వెంకటరాజేంద్ర.. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థలో డిప్యూటీ కలెక్టర్‌నని చెప్పుకొనేవాడు. ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.5లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వసూళ్లకు పాల్పడ్డాడు. కొన్నాళ్లుగా డబ్బిచ్చిన వారి ఫోన్లూ ఎత్తకపోవడంతో మోసపోయామని గ్రహించి, అతడి కోసం తీవ్రంగా గాలించారు. చివరికి ప్రభుత్వ కాంట్రాక్టు కావాలంటూ ఒకరితో ఫోన్‌ చేయించి ఆ నగదు తీసుకొనేందుకు గన్నవరం రావాలని చెప్పించారు. అది నమ్మిన వెంకటరాజేంద్ర గన్నవరం రాగానే భాజపా రాష్ట్ర నాయకుడు చిగురుపాటి కుమారస్వామి సాయంతో బాధితురాలు శ్రీలక్ష్మి, ఆమె తమ్ముడు పట్టుకొన్నారు. గురువారం అర్ధరాత్రి పోలీసులకు అప్పగించారు. విషయం తెలుసుకొన్న బాధితులు స్టేషన్‌కు వచ్చి అతడి మోసాలను పోలీసులకు వివరించారు. వెంకటరాజేంద్ర వాట్సప్‌ను పరిశీలించిన పోలీసులు శ్రీలంకలో క్రికెట్‌ బెట్టింగ్‌లు, గోవా, ఇతర ప్రాంతాల్లో జల్సాలు చేసినట్లు గుర్తించారు. ప్రభుత్వ కాంట్రాక్టు ఇప్పిస్తామని చెప్పి రూ.9 లక్షలు తీసుకున్నాడని బాధితురాలు శ్రీలక్ష్మి తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వెంకటరాజేంద్రను అరెస్టు చేశారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు