Pak spy: పాక్‌లోని ‘సోనల్‌’ కోసం.. సైనిక సమాచారం లీక్‌ చేసిన ఇంజినీర్‌..!

ఫేస్‌బుక్‌లో పరిచయమైన మహిళ కోసం ఓ వ్యక్తి సైనిక రహస్యాలను పాక్‌కు చేరవేశాడు. వీటిల్లో కీలకమైన డ్రోన్ల వివరాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Updated : 10 May 2024 15:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఓ ప్రముఖ ఐటీ సంస్థలో పని చేస్తున్న అమ్మాయి తనను ప్రేమిస్తుందనుకొన్న ఓ ఇంజినీర్‌ రక్షణశాఖ రహస్యాలను ఆమెకు చేరవేశాడు. చివరికి సీఐడీ అధికారులకు చిక్కి జైలుపాలయ్యాడు. నిందితుడు ప్రవీణ్‌ మిశ్రా భారత దళాలకు క్షిపణి, డ్రోన్‌ విడిభాగాలను సరఫరా చేసే ఓ సంస్థలో పని చేశాడు. అతడికి ఫేస్‌బుక్‌లో సోనాల్‌ గర్గ్‌ అనే మహిళ పరిచయమైంది. తను చండీఘడ్‌లోని ఐబీఎం కార్యాలయంలో పనిచేస్తున్నట్లు చెప్పుకొంది. వాస్తవానికి ఆమె పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ఆపరేటీవ్‌. 

సోనల్‌ భారత్‌కు చెందిన ఫోన్‌ నెంబర్‌ను పొంది మిశ్రాతో ఛాటింగ్‌కు వాడేది. దీంతో ఆమె కోసం సైన్యం, రక్షణ సంస్థలకు చెందిన కీలక సమాచారాన్ని మిశ్రా సేకరించాడు. ఈక్రమంలో అంకాలేశ్వర్‌లోని ఓ కంపెనీకి చెందిన సున్నితమైన సమాచారం సేకరించాడు. ఆ కంపెనీ కంప్యూటర్లలో మాల్‌వేర్‌ను చొప్పించేందుకు కూడా ప్రయత్నించాడు. అతడి కదలికలను ఉదంపూర్‌లోని మిలటరీ ఇంటెలిజెన్స్‌ విభాగం గుర్తించింది. తక్షణమే గుజరాత్‌ అధికారులను అప్రమత్తం చేసింది. మొత్తంమీద అతడిని గుజరాత్‌ సీఐడీ అధికారులు భరూచ్‌ జిల్లాలో అరెస్టు చేశారు.

విచారణ సమయంలో అతడి ఫోన్‌ను స్వాధీనం చేసుకొన్నారు. అందులో భారీఎత్తున రక్షణ సమాచారం ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే అతడు పాక్‌కు కొంత పంపించినట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా డ్రోన్ల తయారీ ఇన్ఫర్మేషన్‌ వీటిల్లో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే భారత్‌లోని రక్షణరంగ సంస్థల్లో ఉద్యోగస్థులను లక్ష్యంగా చేసుకొని పాక్‌ ఐఎస్‌ఏ వలపు వల విసురుతున్న విషయం తెలిసిందే. చాలామంది ఉద్యోగులు వీటి బారినపడి ఇప్పుడు జైళ్లలో మగ్గుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని