KL Rahul - Shami: అతడు కెప్టెన్‌.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్‌కు మద్దతుగా షమీ

క్రికెటర్ పట్ల ప్రాంచైజీ ఓనర్ వ్యవహరించిన తీరు ఇప్పుడు పెద్ద హాట్‌ టాపిక్‌గా మారింది. అందులోనూ అతడు కెప్టెన్‌ కావడంతో విషయం సీరియస్‌గా మారింది.

Updated : 10 May 2024 15:21 IST

ఇంటర్నెట్ డెస్క్: లఖ్‌నవూ సారథి కేఎల్‌ రాహుల్‌కు (KL Rahul) భారత స్టార్‌ పేసర్ షమీ మద్దతుగా నిలిచాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌ అనంతరం కేఎల్‌ రాహుల్‌తో ఆ ఫ్రాచైంజీ ఓనర్ సంజీవ్‌ గోయెంకా తీవ్రంగా చర్చిస్తున్న వీడియోలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఒక కెప్టెన్‌తో అలా కెమెరా ముందే మాట్లాడటం సరైంది కాదనే అభిప్రాయం క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. సోషల్‌ మీడియాలోనూ గోయెంకా తీరుపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడిన షమీ.. ప్రతి క్రికెటర్‌కు ఆత్మ గౌరవం ఉంటుందని వ్యాఖ్యానించాడు. 

‘‘మీరు ఓనర్. ఎంతో మర్యాదస్తులు. అదే సమయంలో ఆటగాళ్లకు గౌరవం ఇవ్వాలి. చాలామంది మిమ్మల్ని చూసి చాలా విషయాలు నేర్చుకుంటారు. ఇలాంటి వాటిని మైదానంలో కెమెరా ముందు కాకుండా.. డ్రెస్సింగ్‌ రూమ్‌ లేదా సమావేశాల్లో మాట్లాడి ఉంటే బాగుండేది. ఇది చాలా అవమానకరం. ఎందుకంటే అతడు ఒక కెప్టెన్. సాధారణ ప్లేయర్‌ కూడా కాదు. క్రికెట్‌ అంటేనే టీమ్‌ గేమ్. ప్రణాళికలు ఒక్కోసారి సక్సెస్ కావు. మ్యాచ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ప్రతి ఆటగాడికి గౌరవం ఇవ్వాలి. మాట్లాడేందుకు ఓ విధానం ఉంటుంది. ఇలా చేయడం వల్ల తప్పుడు సందేశం ఇచ్చినట్లు అవుతుంది’’ అని షమీ వ్యాఖ్యానించాడు. 

కేఎల్ రాహుల్‌ మెరుగుపడాలి: ముంబయి మాజీ ఆటగాడు

‘‘టీ20 ఫార్మాట్‌కు తగ్గట్టుగా కేఎల్ రాహుల్ మారాలి. ఇప్పుడు పొట్టి కప్‌ కోసం ఎంపిక కాకపోవడం కూడా అతడికి హెచ్చరికలాంటిదే. భారత్‌ తరఫున భవిష్యత్తులో ఆడాలనకుంటే తన శైలిని మార్చుకోవాలి. గతంలోనూ కేఎల్‌కు ఇలాంటి పరిస్థితి వచ్చింది. త్వరగానే మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ కొన్ని రోజులుపాటు ఇబ్బంది పడ్డాడు. ఎప్పుడైతే ఫామ్‌ను అందుకొని భారీగా పరుగులు చేశాడో.. వెనక్కి తిరిగి చూసుకోలేదు. అదేవిధంగా కేఎల్‌ కూడా రాణించాలి. ద్రవిడ్, రోహిత్‌ నుంచి అతడికేమీ ముప్పు ఉండదని భావిస్తున్నా. ఉత్తమంగా ఆడితే జట్టు నుంచి తప్పించేందుకు వారు మొగ్గు చూపరు. తప్పకుండా కేఎల్ పుంజుకుంటాడని అనుకుంటున్నా’’ అని ముంబయి మాజీ ఆటగాడు మిచెల్ మెక్‌క్లెనాఘన్ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని