సీఐడీ చేతికి తొలిసారిగా మృతి కేసు..

సూర్యాపేట జిల్లాలో సంచలనం సృష్టించిన ఎల్‌ఎల్‌బీ గ్రాడ్యుయేట్‌ ధరావత్‌ నిఖిల్‌ మృతి కేసును తెలంగాణ సీఐడీ విభాగానికి బదిలీ చేశారు.

Updated : 28 Nov 2022 05:36 IST

సూర్యాపేట జిల్లాలో నిఖిల్‌ మరణంపై దర్యాప్తు

ఈనాడు, హైదరాబాద్‌: సూర్యాపేట జిల్లాలో సంచలనం సృష్టించిన ఎల్‌ఎల్‌బీ గ్రాడ్యుయేట్‌ ధరావత్‌ నిఖిల్‌ మృతి కేసును తెలంగాణ సీఐడీ విభాగానికి బదిలీ చేశారు. అతని మృతిపై పలు అనుమానాలు తలెత్తడం, కుటుంబసభ్యులు హత్యకోణంలో ఆరోపణలు చేయడం వంటి కారణాల నేపథ్యంలో డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు సూర్యాపేట పోలీసులు కేసును సీఐడీకి అప్పగించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఐడీ ఓ మృతికేసు దర్యాప్తును చేపట్టడం ఇదే తొలిసారి. సూర్యాపేటకు చెందిన మాజీ కౌన్సిలర్‌ భాస్కర్‌ కుమారుడు నిఖిల్‌ చిలుకూరు మండలం ఆర్లగూడెంలో గతనెల 9వ తేదీ రాత్రి మృతిచెందిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఉంటున్న నిఖిల్‌ దసరా సెలవుల నిమిత్తం అప్పట్లో సూర్యాపేటకు వెళ్లాడు. అనంతరం గత నెల 9న కోదాడలో పుట్టినరోజు వేడుక కోసం వెళ్లాడు. అదేరోజు రాత్రి అతని మృతదేహాన్ని సాగర్‌ కెనాల్‌లో కనుగొన్నారు. అంతకుముందు అతన్ని ఓ యువతి (సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌) కలిసినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో నిఖిల్‌ మృతిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అతని కుటుంబసభ్యులు హత్యగా అనుమానిస్తున్నారు. నెల రోజులకుపైగా దర్యాప్తు చేపట్టిన సూర్యాపేట పోలీసులు హత్యే అని నిరూపించే ఆధారాల్ని సేకరించలేకపోయారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలోనూ అలాంటిది వెల్లడి కానట్లు సమాచారం. నిఖిల్‌ నీటిలో మునిగే చనిపోయాడని పోలీసులు భావిస్తున్నా.. కారణాలపై ఇంతవరకు స్పష్టత రాలేదు. మరోవైపు ఈ ఉదంతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఈ నేపథ్యంలో కేసును సీఐడీకి అప్పగించారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు