Adibatla kidnap case: ఫోన్‌ ఒకవైపు.. తానొక వైపు

మన్నెగూడలో బీడీఎస్‌ విద్యార్థిని అపహరణ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి వ్యవహార శైలిపై కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Updated : 14 Dec 2022 09:34 IST

యువతి కిడ్నాప్‌ సూత్రధారి నవీన్‌ వ్యూహం

ఈనాడు, హైదరాబాద్‌ - ఆదిభట్ల, న్యూస్‌టుడే: మన్నెగూడలో బీడీఎస్‌ విద్యార్థిని అపహరణ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి వ్యవహార శైలిపై కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆదిభట్ల పోలీసులు ఇబ్రహీంపట్నం కోర్టులో సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించారు. హైదరాబాద్‌, మన్నెగూడకు చెందిన బీడీఎస్‌ విద్యార్థిని బొంగులూరులో బ్యాడ్మింటన్‌ శిక్షణకు వెళ్లిన సమయంలో మిస్టర్‌ టీ ఎండీ కొడుదుల నవీన్‌రెడ్డి (29) పరిచయమయ్యాడు. కొద్ది రోజుల తర్వాత ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకోవాలని వెంటపడ్డాడు.

తన సన్నిహితులు కొందరిని యువతి ఇంటికి పంపి పెళ్లి ప్రస్తావన తేవడంతో ఆమె తల్లిదండ్రులు తిరస్కరించారు. దీంతో నవీన్‌ ఆమె కుటుంబాన్ని అప్రతిష్ఠ పాల్జేయడం మొదలుపెట్టాడు. యువతికి పదేపదే సందేశాలు పంపాడు. గతంలో ఆమెతో దిగిన ఫొటోలు చూపిస్తూ దామోదర్‌రెడ్డిని బ్లాక్‌మెయిల్‌ చేశాడు. ఆమె పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచి ఆ ఫొటోలు పెట్టాడు. దీనిపై యువతి ఫిర్యాదుతో ఆదిభట్ల ఠాణాలో నవీన్‌ సహా మరో ఇద్దరిపై కేసు నమోదైంది. ఈ నెల 9న ఆమె నిశ్చితార్థమని తెలుసుకున్న నవీన్‌రెడ్డి ఆమెను ఎత్తుకెళ్లి వివాహం చేసుకోవాలని ప్రణాళిక రచించాడు. తన స్నేహితులు, తన టీ ఫ్రాంచైజీల్లో పనిచేసే 36 మందిని ముందు రోజు రాత్రి మన్నెగూడకు రప్పించి ఆమెకు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారని నమ్మించి, కిడ్నాప్‌ ప్రణాళిక వివరించాడు. 

మిర్యాలగూడ సమీపంలోనే..

నవీన్‌ తదితరులు శుక్రవారం ఉదయం 11 గంటలకు వోల్వో, బొలెరో సహా నాలుగు కార్లు, మరికొన్ని వాహనాల్లో ఇనుప రాడ్లు, కర్రలు, రాళ్లతో యువతి ఇంటికి చేరుకుని దౌర్జన్యంగా లోపలికి ప్రవేశించారు. అడ్డుకోబోయిన దామోదర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డిపైనా దాడి చేశారు. నవీన్‌రెడ్డి, మహ్మద్‌ వాజిద్‌, రాథోడ్‌ సాయినాథ్‌, సిద్ధు, చందు కలిసి యువతిని వోల్వో కారు (టీఎస్‌07 ఎక్స్‌హెచ్‌ 2111)లో ఎక్కించుకుని ఇబ్రహీంపట్నం మీదుగా సాగర్‌ రోడ్డులో నల్గొండ వైపు వెళ్లారు. మరొకరితో పెళ్లికి ఎలా అంగీకరించావంటూ యువతిని నవీన్‌ కారులో విపరీతంగా కొట్టాడు. పోలీసులకు పట్టుబడకుండా మిర్యాలగూడకు వెళ్లే దారిలో అందరి ఫోన్లు ఫ్లైట్‌ మోడ్‌లో పెట్టించాడు. తర్వాత  యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారని, పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారని తెలియడంతో భయపడ్డ నవీన్‌.. సిద్ధు, చందులతో కలిసి మిర్యాలగూడ నుంచి నల్గొండ వెళ్లే మార్గంలో కారు దిగిపోయాడు.

నవీన్‌ సూచనలతో వాజిద్‌ రాత్రి 8.37 గంటల సమయంలో వాజిద్‌ మన్నెగూడ ఆర్టీవో కార్యాలయం దగ్గర యువతిని దింపాడు. ఆమె అక్కడి నుంచి తండ్రికి కాల్‌ చేసి సమాచారం ఇవ్వడంతో దామోదర్‌రెడ్డి తన బంధువును పంపి కుమార్తెను ఇంటికి తీసుకొచ్చారు. ఆమెకు తల, చెంప, భుజం, ఎడమ కాలు, కుడి కన్నుపై గాయాలయ్యాయి. తనపై లైంగిక దాడికి పాల్పడలేదని ఆమె తెలిపింది. వాజిద్‌ కారును శంషాబాద్‌లోని తొండుపల్లి దగ్గర వదిలిపెట్టాడు. దాడిలో పాల్గొన్న మరో 32 మంది హస్తినాపురం కేశవపురి కాలనీలోని మిస్టర్‌ టీ ప్రధాన కార్యాలయంలో శనివారం సమావేశమైనట్లు సమాచారం అందుకుని వారిని అరెస్టు చేశారు.  ఈ కేసులో అయినాగారం భానుప్రకాశ్‌ (20), రాథోడ్‌ సాయినాథ్‌ (22), గానోజి ప్రసాద్‌ (25), కోతి హరి (30), బోని విశ్వేశ్వర్‌రావు (26)లను కస్టడీకి ఇవ్వాలని ఆదిభట్ల పోలీసులు ఇబ్రహీంపట్నం కోర్టులో మంగళవారం పిటిషన్‌ దాఖలు చేశారు.  కోరారు.

నవీన్‌రెడ్డి అరెస్టు!

బీడీఎస్‌ విద్యార్థిని అపహరణ కేసులో ప్రధాన సూత్రధారి, మిస్టర్‌ టీ ఎండీ నవీన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఉత్తర గోవాలోని కాందోలిమ్‌ బీచ్‌ దగ్గర అతడిని అరెస్టు చేసినట్లు సమాచారం. నిందితుడి నుంచి మొత్తం అయిదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అతడిని గోవా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. కిడ్నాప్‌ ఘటనపై నవీన్‌ మాట్లాడుతున్న ఒక సెల్ఫీ వీడియో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ‘కిడ్నాప్‌ చేయడం తప్పేనని అంగీకరిస్తున్నా.. ఈ ఉదంతంలో మీడియా సహా ప్రజలంతా నన్ను అప్రతిష్ఠ పాల్జేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ఒక మనసుకు సంబంధించిన వ్యవహారంగా సానుకూలంగా చూడాలి’ అని మాట్లాడాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని