Assault: సంరక్షకురాలు కాదు రాక్షసి.. 8నెలల పసికందుపై ప్రతాపం

తమ చిన్నారులకు తాము లేని లోటు తీరుస్తుందని ఓ సంరక్షకురాలిని నియమించుకుంటే.. ఆమే వారిపై దాడికి పాల్పడింది. విచక్షణారహితంగా కొట్టింది.......

Published : 06 Feb 2022 02:23 IST

అహ్మదాబాద్‌: తమ చిన్నారులకు తాము లేని లోటు తీరుస్తుందని ఓ సంరక్షకురాలిని నియమించుకుంటే.. ఆమే వారిపై దాడికి పాల్పడింది. విచక్షణారహితంగా కొట్టింది తలను నేలకేసిబాదింది. ఈ అమానవీయ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో జరిగింది. దాడికి గురైన చిన్నారులను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేర్చారు.

సూరత్‌లోని రాందేర్‌ పలన్‌పుర్‌లో ఓ జంట నివాసముంటోంది. భార్యాభర్తలిద్దరు ఉద్యోగాలు చేస్తుండటంతో వారి చిన్నారులను చూసుకునేందుకు కళాబెన్‌ పటేల్‌ అనే సంరక్షకురాలిని నియమించుకున్నారు. కేర్‌టేకర్‌ ఉన్నప్పటికీ ఇంట్లో తరచూ పిల్లల ఏడుపులు వినొస్తున్నాయని పొరుగింటివారు చెప్పడంతో అనుమానం వచ్చి ఆ దంపతులు ఇంట్లో సీసీ కెమెరాలను అమర్చారు. దీంతో ఆ సంరక్షకురాలి కర్కశత్వం బయటపడింది. 8నెలల చిన్నారిని కిరాతకంగా కొడుతున్న దృశ్యాన్ని కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యాయి. ఓ చిన్నారి తలను పదేపదే కింద కొట్టడం వీడియోలో కనిపించింది. నొప్పిని భరించలేక ఆ పసికందు ఇంకా ఎక్కువ ఏడుస్తుంటే చెంపలపై కొడుతుండటం రికార్డయ్యింది.

సాయంత్రం ఇంటికి చేరుకొని సీసీ ఫుటేజీని పరిశీలించిన తల్లిదండ్రులు ఆ దృశ్యాలను చూసి తల్లడిల్లిపోయారు. వెంటనే పోలీసుస్టేషన్‌కు చేరుకొని కేర్‌టేకర్‌పై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితురాలు కళాబెన్‌ పటేల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆమెకి ఐదేళ్ల క్రితం వివాహం జరిగిందని ఇప్పటివరకు పిల్లలు లేరని పోలీసులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని