Hyderabad: నా భర్తపై వాళ్లిద్దరూ పెట్రోల్‌ పోసి తగులబెట్టారు: హోంగార్డు భార్య

తన భర్త 17 ఏళ్లుగా నిబద్ధతతో విధులు నిర్వహించారని హోంగార్డు రవీందర్‌ భార్య సంధ్య అన్నారు.

Updated : 08 Sep 2023 13:07 IST

హైదరాబాద్‌: తన భర్త 17 ఏళ్లుగా నిబద్ధతతో విధులు నిర్వహించారని మృతిచెందిన హోంగార్డు రవీందర్‌ భార్య సంధ్య అన్నారు. రవీందర్‌పై ఏఎస్సై నర్సింగ్‌రావు, కానిస్టేబుల్‌ చందు పెట్రోల్‌ పోసి తగులబెట్టారని ఆమె ఆరోపించారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్‌ బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. రవీందర్‌ ఫోన్‌ను అన్‌లాక్‌ చేసి డేటా డిలీట్‌ చేశారని.. ఇప్పటి వరకూ వాళ్లిద్దరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదని సంధ్య నిలదీశారు. తన భర్తతో తాను మాట్లాడిన తర్వాతే చంపేశారని ఆరోపించారు. రవీందర్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. 

ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న హోంగార్డు మృతి

రవీందర్‌ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. అతడిని హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సంధ్యతో పాటు కుటుంబసభ్యులు ఉదయం 9 గంటల నుంచి ఉస్మానియా ఆస్పత్రి ఓపీ విభాగం వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. రవీందర్‌ భార్య ఆందోళనకు మరికొందరు హోంగార్డులు మద్దతు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సంధ్యతో చర్చించారు. ఉస్మానియాలో అత్యవసర వైద్య సేవలకు వచ్చేవారికి ఇబ్బంది ఎదురవుతోందని.. ఆందోళన విరమించాలని సీఐ కోరినా ఆమె వెనక్కి తగ్గలేదు. రవీందర్‌పై పెట్రోల్‌ పోసి తగులబెట్టారని.. ఆ సీసీ ఫుటేజీ బయటపెట్టాలని కుటుంబసభ్యులు డిమాండ్‌ చేశారు. అప్పటి వరకు ఆందోళన విరమించబోమని తేల్చి చెప్పారు. 

హోంగార్డు మృతి నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు

హోంగార్డు మృతి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోంగార్డుల విషయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. హోంగార్డులెవరూ రవీందర్ కుటుంబానికి మద్దతుగా వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. హోంగార్డులు డ్యూటీలో ఉండేలా చూసుకోవాలని సీఐలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. డ్యూటీలో లేని హోంగార్డులో తప్పనిసరిగా పీఎస్‌లో ఉండాలని సూచించారు. ఎవరైనా విధులకు రాకపోతే వాళ్లను తొలగించాల్సి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని