Crime News: గొంతు కోశాడు!

అనుమానం పెనుభూతంగా మారిన ఓ వ్యక్తి మృగంలా ప్రవర్తించాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య గొంతుకోసి పెళ్లైన 28 రోజులకే అత్యంత దారుణంగా అంతమొందించాడు. కుమార్తెల దినోత్సవం రోజు ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. అనంతరం తానూ గొంతుకోసుకొని ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. హైదరాబాద్‌ బాచుపల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం మేరకు..

Updated : 27 Sep 2021 10:27 IST

  పెళ్లైన 28 రోజులకే నవ వధువు దారుణ హత్య
అనుమానంతో అంతమొందించిన భర్త  

తానూ ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం

నిజాంపేట, న్యూస్‌టుడే: అనుమానం పెనుభూతంగా మారిన ఓ వ్యక్తి మృగంలా ప్రవర్తించాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య గొంతుకోసి పెళ్లైన 28 రోజులకే అత్యంత దారుణంగా అంతమొందించాడు. కుమార్తెల దినోత్సవం రోజు ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. అనంతరం తానూ గొంతుకోసుకొని ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. హైదరాబాద్‌ బాచుపల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కామారెడ్డి సమీపంలోని దేవునిపల్లికి చెందిన పుట్టాల గంగారాం, లక్ష్మి దంపతుల రెండో కుమార్తె సుధారాణి(22).. కామారెడ్డిలోని శ్రీరాంనగర్‌కు చెందిన ఎర్రోళ్ల సిద్దిరాములు, భారతిల పెద్ద కుమారుడు కిరణ్‌కుమార్‌ ప్రేమించుకొన్నారు. ఈ ఏడాది ఆగస్టు 27న పెద్దలు పెళ్లి జరిపించారు. వారం రోజుల కిందట నిజాంపేట పరిధిలోని ప్రగతినగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో కాపురం పెట్టారు. తమ కుమార్తెను చూడటానికి శనివారం సాయంత్రం 4 గంటలకు సుధారాణి తల్లిదండ్రులు వచ్చారు.  పలుమార్లు తలుపులు తట్టినా ఎంతకూ తీయలేదు. కుమార్తె, అల్లుడికి ఫోన్లు చేసినా ఫలితం లేకపోయింది. రాత్రి 7గంటల సమయంలో ఇరుగుపొరుగు సాయంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా.. బెడ్‌రూంలో సుధారాణి రక్తపుమడుగులో మృతిచెంది కనిపించింది. ఆమె మెడపై, శరీర భాగాల్లో బ్లేడుతో కోసిన గాయాలున్నాయి. ఊరినుంచి వచ్చే ముందు తమ కుమార్తెకు ఫోన్‌ చేశామని..‘మీరు బయలుదేరారా.. త్వరగా రండి..’అని గద్గద స్వరంతో చెప్పిందని..తల్లిదండ్రులు వాపోయారు. సుధారాణి చనిపోయిన గదిలోని బాత్‌రూంలో కిరణ్‌కుమార్‌ సైతం గాయాలతో పడి ఉన్నాడు. వెంటనే పోలీసులు అతన్ని సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. భార్యను హత్య చేశాక ఆత్మహత్యకు యత్నించి ఉంటాడని భావిస్తున్నారు.

వారం రోజులకే మొదలైన వేధింపులు

వివాహమైన వారం నుంచే అనుమానంతో సుధారాణిని కిరణ్‌కుమార్‌ వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ సారి గొంతు నులిమి హత్య చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం. ఇరు కుటుంబాలు పంచాయతీపెట్టి సముదాయించి వారం క్రితమే హైదరాబాద్‌కు కాపురానికి పంపినట్లు బంధువులు తెలిపారు. కిరణ్‌కుమార్‌ గతంలో పలుమార్లు సైకోలా ప్రవర్తించేవాడని సుధారాణి బంధువులు పేర్కొంటున్నారు. కాగా నిందితుడి తండ్రి సిద్దిరాములు ‘ఈనాడు’తో మాట్లాడుతూ వివాహానికి 4నెలల ముందు తమ కుమారుడి తలకు రోడ్డు ప్రమాదంలో గాయమైందని, అప్పటి నుంచే ఇలా ప్రవర్తిస్తున్నాడన్నారు. ప్రస్తుతం నిందితుడి పరిస్థితి కూడా విషమంగా ఉంది.

మృతురాలి బంధువుల ఆందోళన

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: తమ కుమార్తెను అనుమానంతో అల్లుడే కిరాతకంగా గొంతు కోసి హత్యచేశాడని సుధారాణి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. అల్లుడి తల్లిదండ్రులకు ఈ ఘటన ముందే తెలిసినా తమకు చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డిలోని కిరణ్‌కుమార్‌ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు