ఇదేం ఘోరం! డ్రగ్స్‌కు బానిసలై.. కన్నబిడ్డలనే అమ్మేశారు!

డ్రగ్స్‌కు బానిసలైన జంట తమ సొంత బిడ్డలనే అమ్మేసిన దారుణం ముంబయిలో వెలుగుచూసింది.

Published : 24 Nov 2023 16:20 IST

ముంబయి: వ్యసనానికి బానిసలయ్యే తత్వం ఎంతకైనా తెగించేలా ప్రేరేపిస్తుందనడానికి ఇలాంటి ఘటనలే సాక్ష్యం! మాదకద్రవ్యాలకు బానిసలైన దంపతులు డబ్బు కోసం తమ కన్నబిడ్డలనే అమ్మేసిన దారుణం ముంబయిలోని అంధేరీలో వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో దంపతులతో పాటు మరో ఇద్దరిని ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆడ శిశువు (నెల రోజులు)ను గుర్తించిన పోలీసులు.. రెండేళ్ల బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అంధేరీలో నివసించే షబ్బీర్‌, అతడి భార్య సానియా ఖాన్‌ డ్రగ్స్‌కు బానిసలు. డ్రగ్స్‌ కొనుక్కొనేందుకు డబ్బులు లేకపోవడంతో తమ ఇద్దరి పిల్లలను రూ.72వేలకు అమ్మేశారు. కొద్ది రోజుల్లోనే ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఆ దంపతులతో పాటు పిల్లల విక్రయం వ్యవహారంలో కమీషను తీసుకున్న ఉషా రాఠోడ్‌ అనే మహిళ, మరొకరిని అరెస్టు చేశారు.

ఆగలేకపోయిన అమ్మ మనసు.. ఖైదీ బిడ్డకు మాతృత్వాన్ని పంచిన పోలీసమ్మ..!

ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారి దయా నాయక్‌ మాట్లాడుతూ ఈ కేసు వివరాలను వెల్లడించారు.  బాలుడిని రూ.60వేలకు, ఆడ శిశువును రూ.14వేలకు విక్రయించారని తెలిపారు. డ్రగ్స్‌ లేకపోతే బతకలేని పరిస్థితుల్లో ఉన్న ఆ జంటను ఉషా రాఠోడ్‌ అనే మహిళ సంప్రదించింది. దీంతో ఆ జంట తమ రెండేళ్ల బాబును రూ.60వేలకు అమ్మేశారు. అయితే, ఈ బాలుడిని ఎవరికి విక్రయించారనే విషయం  ఇంకా తెలియాల్సి ఉంది. ఇటీవలే పాప పుట్టగా.. షకీల్‌ మాక్రానీ అనే వ్యక్తికి గత నెలలోనే రూ.14వేలకు అమ్మేశారు. ఈ విషయం షబ్బీర్‌ సోదరి రుబీనా ఖాన్‌కు తెలిసింది. డ్రగ్స్‌కు బానిసలైన తన అన్న, వదినలు చేసిన నిర్వాకం గురించి తెలిసి షాకయ్యారు. వారిద్దరిపైనా డీఎన్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసును క్రైం బ్రాంచ్‌కు అప్పగించారు’’ అని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని