కేరళలో ఘోరరోడ్డు ప్రమాదం:ఆరుగురు మృతి

కేరళలోని కాసర్‌గోడ్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు రహదారిపై నుంచి అదుపు తప్పి ఓ ఇంటి పైకప్పుపై పడింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. 

Updated : 03 Jan 2021 16:49 IST

కొచ్చి: కేరళలోని కాసర్‌గోడ్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు రహదారిపై నుంచి అదుపు తప్పి ఓ ఇంటి పైకప్పుపై పడింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. 

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కాసర్‌గోడ్‌ సమీపంలో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఎత్తయిన ప్రాంతం నుంచి బస్సు దిగే క్రమంలో అదుపుతప్పి పక్కనే ఉన్న ఓ ఇంటి పైకప్పుపై పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతులంతా కర్ణాటక వాసులుగా గుర్తించారు. 

మృతదేహాల్ని పూదమకల్లు తాలుకా ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో శ్రేయస్‌(13), రవిచంద్ర(40), జయలక్ష్మీ(39), రాజేష్(45), సుమతిలను గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన ముగ్గురిని మంగళూరు ఆస్పత్రికి తరలించారు. ఇతర క్షతగాత్రుల్ని సమీపంలోని ఇతర ఆస్పత్రులకు తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా వధువు తరపు బంధువులే కావడం గమనార్హం. వారంతా సూలియా ప్రాంతం నుంచి పనత్తూరు ఎల్లుకొచ్చికి ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు అందిస్తున్నారు. బస్సు పడిన ఇల్లు జోస్‌ అనే వ్యక్తికి చెందింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరని జోస్‌ తెలిపారు. 

కాగా ఈ ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్‌ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు సూచించారు. 

ఇదీ చదవండి

అటల్‌ టన్నెల్‌ వద్ద చిక్కుకున్న పర్యాటకులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని