Published : 07 Sep 2021 07:29 IST

Suicide attempt: ఎన్‌కౌంటర్‌ భయంతో ఇద్దరి ఆత్మహత్యాయత్నం

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: పోలీసులతో ఎన్‌కౌంటర్‌ చేయిస్తారనే మనోవేదనతో ఇద్దరు తెదేపా సానుభూతిపరులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. బాధితుల బంధువులు, స్థానికుల వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచర్లలో సుమారు 4సెంట్ల గ్రామకంఠం గురించి తెదేపా, వైకాపా సానుభూతిపరుల మధ్య వివాదమేర్పడింది. దీనిపై ఈ నెల 4న రెండు వర్గాలవారు లింగసముద్రం పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఇరువర్గాలను ఎస్సై రమేష్‌ ఆదివారం స్టేషన్‌కు పిలిపించారు. వైకాపా సానుభూతిపరులకు మద్దతుగా వెళ్లిన కె.కొండలరావు అనే వ్యక్తి.. అదే గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు వేముల గోపాల్‌ను ఈ సమయంలో దుర్భాషలాడారు. ఈ మాటలను తెదేపా సానుభూతిపరుడైన పల్లపోతు రత్తయ్య సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి గోపాల్‌కు పంపారు. మొగిలిచర్ల బస్టాండ్‌ వద్ద కూర్చుని ఉన్న కె.కొండలరావును ఈ విషయమై గోపాల్‌ ఆదివారం నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదమేర్పడి తోపులాట చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని సర్దిచెప్పి పంపించారు. అనంతరం 11 మంది తెదేపా, ఐదుగురు వైకాపా వర్గీయులపై కేసులు నమోదు చేసి అదే రోజు రాత్రి వేముల గోపాల్‌తోపాటు మరికొందరిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అర్ధరాత్రి వరకు విడుదల చేయకపోవడంతో గోపాల్‌కు మద్దతుగా పలువురు స్టేషన్‌ ఎదుట ధర్నా చేశారు. గోపాల్‌ను తిట్టినట్టు సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి పంపడం వల్లే వివాదం తలెత్తిందని, దీనికి కారకులైన రత్తయ్య, శ్రీకాంత్‌ స్టేషన్‌కు రావాలని పోలీసులు సోమవారం ఉదయం ఒత్తిడి చేసినట్టు సమాచారం. ఇదే సమయంలో పోలీసులతో ఎన్‌కౌంటర్‌ చేయిస్తామని వైకాపా వర్గీయులు బెదిరించినట్టు రత్తయ్య, శ్రీకాంత్‌ బంధువులు చెబుతున్నారు. స్టేషన్‌కు వెళితే ఏమవుతుందోననే భయంతో రత్తయ్య, శ్రీకాంత్‌లు కాకర్లపాలెం అడ్డరోడ్డు సమీపంలో ఉన్న డంపింగ్‌యార్డు వద్దకెళ్లి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారిని స్థానికులు 108 వాహనంలో వలేటి¨వారిపాలెం పీహెచ్‌సీకి, అక్కడి నుంచి కందుకూరు ఆసుపత్రికి తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు ఆదివారం రాత్రి రెండు కేసులు నమోదు చేశామని, గోపాల్‌ అక్కడే ఉండటంతో గొడవ ముదరకుండా స్టేషన్‌కు తీసుకొచ్చినట్టు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. చట్టప్రకారమే వ్యవహరిస్తున్నామని, పోలీసుల వేధింపుల వల్లే వారు పురుగుమందు తాగారనడం అవాస్తవమని చెప్పారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని