logo

ఓటర్‌ స్లిప్‌ చూపించు.. రూ.3 వేలు తీసుకో..! జోరుగా వైకాపా నగదు పంపిణీ

కొత్తపల్లి మండలంలో గత రెండు రోజులుగా నిత్యం అర్ధరాత్రి వరకు ఓటుకు నోట్ల పంపిణీ జరుగుతోంది. వైకాపా నాయకులు  గ్రామాల్లో పర్యటిస్తూ ఓటరు స్లిప్పుల ఆధారంగా ఒక్కో ఓటుకు రూ.3వేలు చొప్పున అందజేస్తున్నారు.

Updated : 10 May 2024 07:32 IST

రాజీనామా చేసిన వాలంటీర్లదే ప్రధాన పాత్ర

కొత్తపల్లి, కాకినాడ కలెక్టరేట్‌: కొత్తపల్లి మండలంలో గత రెండు రోజులుగా నిత్యం అర్ధరాత్రి వరకు ఓటుకు నోట్ల పంపిణీ జరుగుతోంది. వైకాపా నాయకులు  గ్రామాల్లో పర్యటిస్తూ ఓటరు స్లిప్పుల ఆధారంగా ఒక్కో ఓటుకు రూ.3వేలు చొప్పున అందజేస్తున్నారు.  స్థానికేతరులైన వ్యక్తుల ద్వారా పంపిణీకి దిగడం గమనార్హం. ఇప్పటికే కొత్తపల్లి, వాకతిప్ప, కుతుకుడుమిలి తదితర గ్రామాల్లో పంపిణీ జోరుగా సాగుతోంది. కొత్తపల్లిలో వైకాపా నాయకుడి ఆధ్వర్యంలోనే పంపిణీ పూర్తి చేశారు. ముందుగా రాజీనామాలు చేసిన వాలంటీర్లతో జాబితా సిద్ధం చేసుకుని నేరుగా ఓటర్ల ఇంటికెళ్లి నగదు అందిస్తున్నారు. బుధవారం సాయంత్రం ప్రారంభించిన పంపకాల తంతు రాత్రి 2 గంటల వరకు సాగింది. గురువారం కూడా  కొనసాగించారు. దీనికి పది రోజుల ముందు మత్స్యకార ప్రాంతాల్లో వైకాపా నాయకులు రేషన్‌కార్డుకి రూ.2 వేలు చొప్పున పంపిణీ చేసి.. తమకే ఓటేయాలని ప్రచారం చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం స్పందించకపోవడం గమనార్హం.  

కాకినాడలో రూ.2వేలు..

కాకినాడ నగర నియోజకవర్గంలో అధికార వైకాపా ఓట్లు కొనుగోలు చేస్తోంది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు పలు డివిజన్లలో నగదు పంపిణీ జరిగింది.  రాజీనామా చేసిన వాలంటీర్ల సహకారంతో ఓటుకు రూ.2వేలు చొప్పున పంపిణీ చేశారు. ఉదయం  27వ డివిజన్‌లో వైకాపా నాయకులు, రాజీనామా చేసిన వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ఓటుకు రూ.2వేలు చొప్పున అందజేశారు. మధ్యాహ్నం కొన్నిచోట్ల, సాయంత్రం నుంచి రాత్రి వరకు మరికొన్ని ప్రాంతాల్లో నగదు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో  లక్ష ఓట్ల వరకు నగదుకు ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. జగన్నాథపురంలోని 13 డివిజన్లు, నగరంలో పేదలు ఎక్కువగా ఆవాసముంటున్న డివిజన్లలో నగదు పంపిణీ జరిగేలా వ్యూహం రచించినట్లు తెలిసింది.   ఇక్కడా  వైకాపా అభిమానులు, కార్యకర్తలు, తటస్థంగా ఉన్న వారికే నగదు అందజేస్తున్నారు.

నిఘా బృందాలు ఎక్కడ..?

కాకినాడ నగర నియోజకవర్గంలో ఎన్నికల కోడ్‌ వచ్చినప్పటి నుంచి నిఘా బృందాలు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిలో స్థానిక ప్రజాప్రతినిధికి అత్యంత అనుకూలమైన అధికారులను నియమించారనే విమర్శలు ఉన్నాయి.  

డివిజన్ల వారీగా నగదు డంపు..?

అధికార వైకాపా ముందస్తుగానే ఆయా డివిజన్ల పరిధిలో నమ్మకమైన వ్యక్తుల ఇళ్ల వద్ద నగదు దాచినట్లు ప్రచారం జరుగుతోంది. నగదు తరలింపునకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. వీరికి ప్రజలకు రక్షణ కల్పించే శాఖలోని కొందరు అధికారులు సహకారం అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని