ఎన్నికల వేళ.. ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్‌!

ఎన్నికల పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో.. ప్రయాణికుల రద్దీ పెరగడంతో హైదరాబాద్‌ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు టీఎస్‌ఆర్టీసీ పెద్దసంఖ్యలో ప్రత్యేక బస్సులు నడుపుతోంది.

Updated : 10 May 2024 07:27 IST

తెలంగాణ జిల్లాలకు 1,400, ఏపీకి అదనంగా 160 సర్వీసులు

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో.. ప్రయాణికుల రద్దీ పెరగడంతో హైదరాబాద్‌ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు టీఎస్‌ఆర్టీసీ పెద్దసంఖ్యలో ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఏపీకి ఇప్పటికే ప్రకటించిన బస్సుల్లో సీట్లన్నీ రిజర్వ్‌ అయిపోయాయి. దీంతో టీఎస్‌ఆర్టీసీ గురువారం అదనంగా మరో 160 సర్వీసులను ఆన్‌లైన్‌లో పెట్టింది. తెలంగాణ జిల్లాలకు వెయ్యికి పైచిలుకు బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈనెల 10, 11, 12 తేదీల్లో టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. ఈ మూడు రోజుల్లో తెలంగాణ జిల్లాలకు 1,400 సర్వీసుల్ని సిద్ధం చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. హైదరాబాద్‌లో ఎంజీబీఎస్‌, జేబీఎస్‌లతోపాటు ఆరాంఘర్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు బయల్దేరేలా ఏర్పాట్లు చేశామన్నారు. నిజామాబాద్‌, కరీంనగర్‌, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, వరంగల్‌ తదితర ప్రాంతాలకు డిమాండ్‌కు అనుగుణంగా బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.

ఆర్టీసీలో గతంతో పోలిస్తే బస్సుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో ఉన్నవాటినే ప్రజల ప్రయాణాలకు అనుగుణంగా సర్దుబాటు చేస్తూ ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళికలు తయారు చేసింది. బస్సులు చాలకపోవడంతో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులనూ దూరప్రాంతాలకు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సిటీ ఆర్డినరీ బస్సులను కూడా జిల్లాలకు నడిపే అవకాశాలున్నట్లు సమాచారం.

ఏపీ కోసం ప్రత్యేకంగా 400 సర్వీసులు

టీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్‌ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు రోజూ 300 బస్సులు నడిపిస్తోంది. ఈ బస్సులన్నింట్లో రిజర్వేషన్లు అయిపోయాయి. ప్రత్యేక బస్సుల్లోనూ టికెట్లు వేగంగా రిజర్వు అవుతున్నాయి. ఈ నెల 10న 120, 11న 150, 12న 130 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. వీటిని విశాఖ, అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం, పోలవరం, కందుకూరు, కనిగిరి, ఉదయగిరి, ఒంగోలు వైపు ఎక్కువగా నడిపిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో 13, 14 తేదీల్లో ఏపీ నుంచి వచ్చేందుకు ఆర్టీసీ బస్సులను సిద్ధం చేస్తోంది.


22 రైళ్లకు అదనపు బోగీలు

ఈనాడు, హైదరాబాద్‌: రైళ్లలో భారీగా నిరీక్షణ జాబితా ఉన్న నేపథ్యంలో రానుపోను కలిపి 22 రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని ద.మ.రైల్వే నిర్ణయించింది. కొన్ని రైళ్లకు 10-13వ తేదీ వరకు.. మరికొన్నింటికి 11-14 వరకు అదనపు సౌకర్యాన్ని కల్పించనుంది. ఒక్కో రైలుకు అదనపు బోగీ ఒక్కోటి మాత్రమే ఉండగా..కొన్ని రైళ్లకు స్లీపర్‌, మరికొన్నింటికి థర్డ్‌ ఏసీ, ఛైర్‌ కార్‌ బోగీ అదనంగా ఉన్నాయి. సికింద్రాబాద్‌-విశాఖ, కాచిగూడ-గుంటూరు, వికారాబాద్‌-గుంటూరు, విశాఖ-గుంటూరు, సికింద్రాబాద్‌-విజయవాడ, ధర్మవరం-నర్సాపూర్‌, తిరుపతి-గుంటూరు, హుబ్లీ-నర్సాపూర్‌, కాచిగూడ-రేపల్లె, బీదర్‌-మచిలీపట్నం తదితర రూట్లలోని అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని