TS News: పోలీసు శాఖలో గంజాయి కలకలం.. ఏఆర్‌ కానిస్టేబుల్‌ అరెస్ట్‌  

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న కానిస్టేబుల్‌తోపాటు మరొకరిని ఖమ్మం ఖానాపురం హవేలి పోలీసులు బుధవారం అదుపులో తీసుకున్నారు.  ఏసీపీ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం సీపీకి అందిన విశ్వసనీయ

Updated : 04 Nov 2021 07:24 IST

 పరారీలో మరో ఇద్దరు!

సతీశ్‌

ఖమ్మం అర్బన్‌, న్యూస్‌టుడే: గంజాయి అక్రమ రవాణా చేస్తున్న కానిస్టేబుల్‌తోపాటు మరొకరిని ఖమ్మం ఖానాపురం హవేలి పోలీసులు బుధవారం అదుపులో తీసుకున్నారు.  ఏసీపీ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం సీపీకి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు నగరంలో పోలీసులు నిఘా పెట్టారు. ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద అయిదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ముదిగొండ మండలం వల్లభికి చెందిన కొండ సతీశ్‌, కొణిజర్ల మండలం పల్లిపాడుకు చెందిన పోలెబోయిన వెంకటేశ్వర్లుగా గుర్తించారు. సతీశ్‌ ఖమ్మం చెరువుబజార్‌లో నివాసం ఉంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కారేపల్లి మండలం తొడితలగూడేనికి చెందిన తన సమీప బంధువైన ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి కొనుగోలు చేసిన గంజాయిని సతీశ్‌కు వెంకటేశ్వర్లు అప్పగించాడు. దీన్ని నగరంలోని మరో వ్యక్తికి ఇచ్చేందుకు ఇద్దరూ వేచిఉండగా పట్టుకున్నట్లు ఏసీపీ వివరించారు. నిందితులిద్దర్నీ రిమాండ్‌కు తరలించామన్నారు. ఇద్దరు కానిస్టేబుళ్లు సహా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని ఆయన తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. పరారీ ఉన్నవారిలో భద్రాద్రి కొత్తగూడెంలో పనిచేస్తున్న ఓ ఏఆర్‌ కానిస్టేబుల్‌, ఖమ్మం జిల్లా కారాగారంలో పనిచేసే కానిస్టేబుల్‌తో పాటు ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఉన్నారని తెలుస్తోంది.

కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌: గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడిగా తేలడంతో కానిస్టేబుల్‌ నరేందర్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్లు జిల్లా కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌ శ్రీధర్‌ తెలిపారు. అతను వార్డర్‌గా పనిచేస్తున్నాడని, మంగళవారం కూడా విధులకు హాజరయ్యాడన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని