Vikarabad: వికారాబాద్‌ కారు గల్లంతు ఘటనలో కొత్త మలుపు

వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలంలో తిమ్మాపూర్‌ వాగు దాటబోతూ దాని ఉద్ధృతికి కారు కొట్టుకుపోయిన ఘటనలో కొత్త మలుపు చోటుచేసుకుంది

Published : 31 Aug 2021 01:39 IST

మర్పల్లి‌: వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలంలో తిమ్మాపూర్‌ వాగు దాటబోతూ దాని ఉద్ధృతికి కారు కొట్టుకుపోయిన ఘటనలో కొత్త మలుపు చోటుచేసుకుంది. వాగులో కొట్టుకుపోయారని అనుకున్న ఇద్దరిలో డ్రైవర్‌ రాఘవేందర్‌ బతికే ఉన్నారు. గల్లంతైనట్లు భావించి ఉదయం నుంచి డ్రైవర్‌ రాఘవేందర్‌రెడ్డి, బాలుడు త్రిషాంత్‌ కోసం స్థానికులు, పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో అనూహ్యంగా రాఘవేందర్‌ చెట్టుకొమ్మను పట్టుకుని బయటపడిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇవాళ ఉదయం 5 గంటలకు రాఘవేందర్‌ ఇంటికి చేరుకున్నట్లు తెలుస్తోంది. గల్లంతైన మరో చిన్నారి కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు డీఎస్పీ సంజీవరావు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి వధువు ప్రవల్లిక, వరుడి సోదరి శ్రుతి మృతదేహాలను పోలీసులు ఇప్పటికే గుర్తించిన విషయం తెలిసిందే. అయితే డ్రైవర్‌ రాఘవేందర్‌ ఉదయం 5 గంటలకే ఇంటికి చేరుకున్నప్పటికీ పోలీసులు బయటపెట్టక పోవడంతో మృతుల బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మర్పల్లి మండలం రావులపల్లికి చెందిన నవాజ్‌రెడ్డి, మోమిన్‌పేట మండలానికి చెందిన సింగిడి దర్శన్‌రెడ్డి కుమార్తె ప్రవల్లికతో ఈ నెల 26న వివాహం జరిగింది. ఆదివారం ఒడి బియ్యం పోసుకోవడానికి మోమిన్‌పేటకు వచ్చారు. సాయంత్రం నూతన దంపతులతో పాటు పెళ్లి కుమారుడి అక్కలు రాధమ్మ, శ్రుతి, చిన్నారి త్రిషాంత్‌, మరో బంధువు రాఘవేందర్‌రెడ్డి రావులపల్లికి కారులో బయలుదేరారు. తిమ్మాపూర్‌ సమీపంలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా చిన్న వాగే కదా అని వారు ముందుకు సాగారు. నీటి ఉద్ధృతికి కారు వాగులో కొట్టుకుపోయింది. పెళ్లి కుమారుడు నవాజ్‌రెడ్డి, అతని అక్క రాధమ్మలు కారు డోర్‌  తెరిచి కాలువలోకి దూకారు. వారిని స్థానికులు ఒడ్డుకు చేర్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని