TS News: తెలివైనోళ్లు మోసపోరు.. మరి మీరు?

ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌.. గంటల కొద్దీ వినియోగం..

Updated : 15 Jul 2021 12:01 IST

సైబర్‌ కేటుగాళ్ల వలకు చిక్కితే అంతే
సైబరాబాద్‌ పోలీసుల వినూత్న అవగాహన

ఈనాడు, హైదరాబాద్‌: ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌.. గంటల కొద్దీ వినియోగం.. సామాజిక మాధ్యమాల్లో షికార్లు.. ఇదే అదునుగా సైబర్‌ నేరగాళ్లు తెలివిగా వల విసురుతున్నారు. అవగాహన లేమి.. ఆశతో ఆ వలలో చిక్కుకుని నిండా మునిగిపోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇలాంటి తరుణంలోనే సైబరాబాద్‌ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి మంగళవారం కాలనీలు.. బస్తీలు.. గేటెడ్‌ కమ్యూనిటీల్లో అవగాహన కల్పిస్తున్నారు. బాధితులతో స్వయంగా మాట్లాడించి అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. 

ఈ ఏడాది కేసులు 2వేలు దాటొచ్చని...

ఓఎల్‌ఎక్స్‌.. కేవైసీ.. కస్టమర్‌ కేర్‌.. ఉద్యోగాలు.. రుణాలు.. బహుమతులు.. పెట్టుబడులు.. ఇలా రోజుకో తరహాలో సైబర్‌ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. 2019తో పోలిస్తే గతేడాది ఒక్క సైబరాబాద్‌ పరిధిలో సైబర్‌ మోసాలు(1119 కేసులు) 135 శాతం పెరిగాయి. రూ.23.67 కోట్లు మోసపోయారు. ఈ ఏడాది ఆ సంఖ్య 2వేల మార్కును దాటే అవకాశముందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అవగాహన లేమి.. ఆశతోనే తేలిగ్గా బాధితులు సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కుతున్నట్లు సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ గుర్తించారు. కమిషనరేట్‌ పరిధిలో 45 శాంతి భద్రతల ఠాణాల పరిధిలో ప్రతి మంగళవారం అవగాహన సదస్సును నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. సైబర్‌ మోసాలు ఎలా జరుగుతున్నాయి.. మన చుట్టూ ఉండే వాళ్లు ఎలా మోసపోయారు.. ఫోన్‌ వినియోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే తదితర అంశాలపై దృశ్యరూపకంగా వివరిస్తున్నారు. సెలబ్రిటీల సహకారంతో రూపొందించిన లఘు చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. తెలివైన వారు సైబర్‌ కేటుగాళ్ల వలలో పడరు అంటూ నిపుణులతో సలహాలు, సూచనలు ఇప్పిస్తున్నారు. ఒకవేళ సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కితే ఎలా.. ఎప్పుడు ఫిర్యాదు చేయాలో సూచిస్తున్నారు.

రూ.100 పోతే తిరిగొచ్చేది రూపాయిన్నరే...

ఒక్కసారి సైబర్‌ కేటుగాళ్ల బారిన పడితే ఇక అంతే.. మీ డబ్బులపై ఆశలు వదులుకోవాల్సిందే. గతేడాది సైబరాబాద్‌ పోలీసులు 75 కేసులను(మొత్తం 1119 కేసులు) ఛేదించి రూ.34.84(1.4 శాతం) లక్షలను మాత్రమే రికవరీ చేశారు. అంటే మనం రూ.100 పోగొట్టుకుంటే మనకు తిరిగొచ్చేది సుమారు రూపాయిన్నరన్న మాట. సైబర్‌ మోసాలకు సంబంధించిన కేసుల ఛేదన అంతా తేలిక కాదు. నైజిరీయన్లు, జాంతారా, భరత్‌పూర్‌ తదితర అంతర్రాష్ట్ర ముఠాలు ఎక్కువగా సైబర్‌ మోసాలకు పాల్పడుతుంటారు. పోలీసులకు చిక్కినా డబ్బుల దొరక్కుండా జాగ్రత్త పడుతుంటారు. బాధితుల ఖాతా నుంచి జమ కావడమే ఆలస్యం.. వెంటనే ఇళ్లు, ఇతరత్రా స్థిరాస్తులను కూడబెట్టుకుంటారు. 

ఇలా చేద్దాం.. 

> వ్యక్తిగత వివరాలు, బ్యాంక్‌ ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోరాదు 
సామాజిక మాధ్యమాల్లో అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లను తిరస్కరించడం ఉత్తమం
గూగుల్‌లో కనిపించే కస్టమర్‌ కేర్‌ నంబర్లను పరిగణనలోకి తీసుకోవద్దు. సంబంధిత వెబ్‌సైట్లు, యాప్‌లో పేర్కొన్న వాటికే కాల్‌ చేయాలి 
డబ్బులు చెల్లిస్తే ఉద్యోగమిప్పిస్తామంటూ వచ్చే ఫోన్‌ కాల్స్, ఈ-మెయిల్స్‌ను నమ్మవద్దు 
ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ను లాక్‌ చేసి పెట్టుకోవాలి 
పేటీఎం, బ్యాంక్, టెలికాం సంస్థల నుంచి కేవైసీ అప్‌డేట్‌ చేసుకోమని వచ్చే ఎస్‌ఎంఎస్, కాల్స్‌కు స్పందించొద్దు
బహుమతులు, లాటరీలు గెలుచుకున్నారంటూ వచ్చే ఎస్‌ఎంఎస్‌లు, కాల్స్‌ను విశ్వసించొద్దు 

సంవత్సరం    కేసులు    మోసం విలువ    రికవరీ(రూ.ల్లో)(రూ.కోట్లలో)    
2018         293          16.06              5.11 కోట్లు
2019         477          23.85              65.1 లక్షలు 
2020         1119         23.67              34.84 లక్షలు
(నోట్‌: వివరాలు సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనివి మాత్రమే..) 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు