రామాయంపేటలో ఉద్రిక్తత.. మృతదేహాలతో మున్సిపల్‌ ఛైర్మన్‌ ఇంటిముందు ఆందోళన

మెదక్‌ జిల్లా రామాయంపేటలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కామారెడ్డిలోని ఓ లాడ్జిలోని గదిలో రామాయంపేట పట్టణానికి చెందిన తల్లీకుమారుడు పద్మ(65), సంతోష్‌(40) నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సంతోష్‌ను రామాయంపేటకు....

Updated : 16 Apr 2022 18:46 IST

రామాయంపేట: మెదక్‌ జిల్లా రామాయంపేటలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కామారెడ్డిలోని ఓ లాడ్జిలో తల్లీకుమారుడు పద్మ(65), సంతోష్‌(40) నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సంతోష్‌ను రామాయంపేటకు చెందిన ప్రజాప్రతినిధులు వేధిస్తున్నారంటూ గతంలో 20 పేజీలతో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందనా లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి బలవన్మరణానికి రామాయంపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ జితేందర్‌ గౌడ్‌ కారణమంటూ ఆయన ఇంటి ముందు పద్మ, సంతోష్‌ మృతదేహాలతో కుటుంబసభ్యులు, విపక్షాలు ఆందోళనకు దిగాయి.

ఇంటి ముందు నిరసన చేపట్టడంతో జితేందర్‌ గౌడ్‌ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. మృతదేహాలను శ్మశానానికి తీసుకెళ్లాలని పోలీసులు సూచించినా కుటుంబసభ్యులు ఆందోళన  కొనసాగించారు. అక్కడి పరిస్థితి తీవ్ర రూపం దాల్చేలా ఉండడంతో జిల్లా ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని స్వయంగా రంగంలోకి దిగారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కేసు నమోదు చేసి.. డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామని ఎస్పీ హామీ ఇవ్వడంతో కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు. ఎస్పీ హామీతో పద్మ, సంతోష్‌ మృతదేహాలను అంత్యక్రియలకు తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని