Andhra News: గంజాయి విక్రయించిన వైకాపా నేత అరెస్టు.. వదిలేయాలని పోలీసులపై ఒత్తిడి

గంజాయి అక్రమ రవాణా కేసులో తీగ లాగితే డొంక కదిలింది  అన్నట్లు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. తాజాగా ఈ కేసులో బాపట్ల జిల్లా చినగంజాంకు చెందిన వైకాపా ఎంపీటీసీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated : 07 Jan 2023 16:31 IST

బాపట్ల: గతనెల బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌లో పోలీసుల జరిపిన దాడుల్లో గంజాయి పట్టుబడిన విషయం తెలిసిందే. గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు యువకులను స్పెషల్‌ వింగ్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా కీలక విషయాలు వెలుగుచూశాయి.  గంజాయి ఎక్కడ్నుంచి వచ్చిందని పోలీసులు విచారిస్తుండగా.. తీగ లాగితే డొంక కదులుతోందన్నట్లు అధికార పార్టీకి చెందిన నేతల పేర్లు బయటికి వస్తున్నాయి. 

ఇద్దరు యువకులు ఇచ్చిన సమాచారం మేరకు అధికార పార్టీకి చెందిన నేతను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా స్టువర్ట్‌పురానికి చెందిన మరో వ్యక్తి అతనికి గంజాయి సరఫరా చేశాడని చెప్పాడు.  ఈ నేపథ్యంలో స్టువర్ట్‌పురానికి చెందిన ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. తనకు చినగంజాంకు చెందిన ఓ వ్యక్తి  తరచు  గంజాయి సరఫరా చేస్తున్నాడని.. అతని నుంచి తీసుకొచ్చి జిల్లాలోని ఇతర ప్రాంతాలకు రవాణా చేసి విక్రయిస్తున్నట్లు తెలిపాడు. దీంతో పోలీసులు చినగంజాంలోని మోటుపల్లికి వెళ్లి ఆ వ్యక్తి ఇంట్లో దాడి చేయగా 15కేజీలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, తొలుత ఆ వ్యక్తి వైకాపాకు చెందిన ఎంపీటీసీ అని పోలీసులు గుర్తించలేదు. అతన్ని అదుపులోకి తీసుకోగానే అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు ఫోన్లు చేసి అతన్ని వదిలేయాలని తీవ్ర ఒత్తిడి చేసినట్లు తెలిసింది. వైకాపా ఎంపీటీసీని పోలీసులు బాపట్ల రూరల్‌  పోలీస్‌స్టేషన్‌కు తరలించి గంజాయి ఎక్కడ్నుంచి తీసుకొస్తున్నారు? ఇంకా ఈ కేసులో ఎవరైనా ఉన్నారనే విషయాలపై కూపీ లాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని