logo

రెవెన్యూ లీలలు.. సామాన్యులకు చిక్కులు

జిల్లాలో కొంతమంది రెవెన్యూ అధికారుల అక్రమాలు అమాయకులకు చుక్కలు చూపిస్తున్నాయి. సొంత అన్నదమ్ములు - కుటుంబాల మధ్య వైరాన్ని పెంచుతున్నాయి. ఆదిలాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాలు సహా బోథ్‌, బేల, జైనథ్‌, నేరడిగొండ

Published : 21 Jan 2022 02:38 IST

రికార్డుల మార్పుచేర్పులతో సమస్యలు
ఈటీవీ - ఆదిలాబాద్‌

జిల్లాలో కొంతమంది రెవెన్యూ అధికారుల అక్రమాలు అమాయకులకు చుక్కలు చూపిస్తున్నాయి. సొంత అన్నదమ్ములు - కుటుంబాల మధ్య వైరాన్ని పెంచుతున్నాయి. ఆదిలాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాలు సహా బోథ్‌, బేల, జైనథ్‌, నేరడిగొండ మండలాలకు స్థిరాస్తి వ్యాపారం విస్తరించడంతో భూములకు డిమాండ్‌ పెరిగింది. వ్యవసాయ భూములనే లే-అవుట్లుగా మార్చి ప్లాట్లు విక్రయించే దందా సాగుతోంది. నిబంధనల ప్రకారం.. వ్యవసాయేతర భూమిగా మార్చి నాలా పన్ను వసూలు చేసి డీటీసీపీ పొందిన వాటికే లే-అవుట్లుగా అనుమతించాల్సి ఉంది. గతంలోనే జిల్లా వ్యాప్తంగా 106 అక్రమ లేఅవుట్లున్నట్టు అధికార యంత్రాంగం నిర్ధారించింది. కానీ అవి ఏవో చెప్పలేదు. చర్యలు కూడా లేవు. ప్రసుత్తం ఆదిలాబాద్‌ పట్టణంలో 64, గ్రామీణ ప్రాంతాల్లో 29 లేఅవుట్లు సక్రమంగా ఉన్నట్లు చెప్పడం గమనార్హం. వ్యవసాయ భూముల్లో అక్రమాలకు తావులేకుండా 2020 అక్టోబరులో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ను సైతం కొంతమంది అధికారులు తమకు అనుకూలంగా మార్చుకోవడం అక్రమాలకు తావిస్తోంది.

అక్రమాలకు సాక్ష్యాలివి..
* జైనథ్‌ మండలం మాకోడలో అయిదుగురు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి మూడెకరాల చొప్పున అందరికీ కలిపి ఒకే చోట 15 ఎకరాలు కొనుగోలు చేసినట్లుగా అధికారులు రికార్డులు తయారుచేయగా ప్రభుత్వం డబ్బులు చెల్లించింది. వాస్తవంగా దళితబంధుకింద లబ్ధిదారులకు పంపిణీ చేసిన భూమి 12.20 ఎకరాలే. పంపకాలు చేసుకునే సమయంలో తేడా రావడంతో ఒక్కొక్కరికి అర ఎకరం తక్కువగా ఉందని గుర్తించిన లబ్ధిదారులు అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఇప్పటిదాకా సమస్య పరిష్కారం కాలేదు.  

* మావల మండలంలో 1999లో కొనుగోలు చేసినట్లు ఉన్న పత్రాలను చూసి ఇటీవల మరొకరికి రిజిస్ట్రేషన్‌ చేయడంతో అసలైన లబ్ధిదారుడు కంగుతినాల్సి వచ్చింది. కనీస  నిబంధనలను పాటించకపోవడం అధికారుల ఇష్టారాజ్యాన్ని వెల్లడిస్తోంది.

* తలమడగు మండలంలో తనకు తెలియకుండా ఒక ఎకరం భూమి మరొకరి పేరిట మార్చారని అసలైన పట్టాదారుకు అధికారులను సంప్రదిస్తే కోర్టులో తేల్చుకోవాలనే వెనక్కి పంపించడం ఘటన తాజాగా వెలుగుచూసింది.

* ఆదిలాబాద్‌లో రెండు ప్రైవేటు స్థలాల విషయంలో అధికారులు పరస్పర విరుద్ధమైన నివేదికలు ఇవ్వడం రెండు వర్గాల మధ్య వైరానికి దారితీసింది.

ఈ విషయాలపై ఆర్డీవో జాడి రాజేశ్వర్‌ను ‘ఈనాడు’ ఫోన్‌లో సంప్రదించగా సమస్యలుంటే మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. భూమి ఎక్కువ, తక్కువ, క్రయవిక్రయాలు, ఇతర సమస్యల పరిష్కారం కోసం మీ సేవలో 31 అంశాలతో కూడిన వెసులుబాటు ఉందని వివరించారు. అలా వచ్చే అర్జీలను పాలనాధికారి ఆమోదిస్తే తిరిగి సవరిస్తామని తెలిపారు.


ఆరు గుంటలు మాయం

చేతిలో పట్టాదారు పాసుపుస్తకాన్ని చూపిస్తున్న ఈయన పేరు రామాయి నారాయణ(51). బోథ్‌ మండలం సోనాలలోని సర్వే నెంబరు 150/ఇ/1లో 3.06 ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది. దానికి అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం పట్టాదారు పుస్తకాన్ని సైతం జారీ చేసింది. నాలుగుసార్లు రైతుబంధు పథకం డబ్బు కూడా జమైంది. గత రబీ సీజన్‌లో ‘రైతుబంధు’ డబ్బులు తక్కువ రావడంతో వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే రెవెన్యూ అధికారులను కలవాలని సూచించారు. బోథ్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో సంప్రదిస్తే ఆర్డీవో కార్యాలయానికి వెళ్లాలని సలహా ఇచ్చారు. ఆర్డీవోను కలిస్తే తిరిగి ఎమ్మార్వోను కలవాలని సూచించారు. ఏడాదిన్నరగా అటు ఇటు తిప్పడమే తప్ప ఆయన పేరిట ఆరు గుంటల భూమి తగ్గించడానికి కారణాలేంటని చెప్పకపోవడం రెవెన్యూ అధికారుల మాయను వెల్లడిస్తోంది.


అసైన్డ్‌ భూమి అంటగట్టారు

బేల మండలం పాఠన్‌లో సర్వే నెంబరు 32/2లో మూడెకరాల భూమిని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓ లబ్ధిదారుడి జీవనోపాధి కోసం కేటాయించింది. నిబంధనల ప్రకారం ఇది ఇతరులకు విక్రయించరాదు. కానీ 2019లో అదే భూమిని రెవెన్యూ, ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు ఎకరాకు రూ.5 లక్షల చొప్పున మూడెకరాలకు కలిపి రూ.15 లక్షలు పరిహారంగా చెల్లించి తీసుకుని, కొబ్బాయి గ్రామానికి చెందిన రేఖాబాయికి దళిత బస్తీ కింద కేటాయించారు. అసైన్డ్‌ భూమి కావడంతో లబ్ధిదారు రేఖాబాయి పేరిట ఇంతవరకు పట్టా జారీ కాలేదు. ఇప్పటికీ రైతుబంధు పథకం, బ్యాంకులో పంటరుణం సైతం అందడం లేదు. స.హ.చట్టం కింద వివరాలు సేకరించిన బాధితులు పాలనాధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని