logo

శిథిల భవనాలు.. సమస్యలకు నిలయాలు

సర్కారు బడులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. మన ఊరు- మనబడి, మన బస్తీ- మనబడి పేరిట మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో విద్యాలయాలు ఆందోళనకరంగా ఉన్నాయి. మొదటి విడతగా 260 ఎంపిక చేయగా

Published : 14 Aug 2022 03:09 IST

జిల్లాలో పాఠశాలల దుస్థితి..

నిర్మల్‌ అర్బన్‌, ఖానాపూర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే

సర్కారు బడులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. మన ఊరు- మనబడి, మన బస్తీ- మనబడి పేరిట మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో విద్యాలయాలు ఆందోళనకరంగా ఉన్నాయి. మొదటి విడతగా 260 ఎంపిక చేయగా, ఇందులో 172 చోట్ల రూ.30 లక్షల్లోపు ఉండడంతో ఇందులో నుంచి 90 బడుల్లో మాత్రమే పనులు ప్రారంభమయ్యాయి. మిగతా చోట్ల ఇంకా మొదలే చేయలేదు. జరుగుతున్నవి సైతం నత్తనడకన సాగుతున్నాయి.

సెలవులే..

ఏళ్ల క్రితం, శిథిలావస్థకు చేరుకొని, పైకప్పులు ఊడిపడి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న విధంగా తయారయ్యాయి. చిన్నపాటి వర్షం కురిస్తే సెలవులు ఇచ్చే పరిస్థితికి చేరుకున్నాయంటే వాటి తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్ఛు ఆంగ్ల మాధ్యమ బోధన, మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామని చెబుతున్నా.. బడుల పరిస్థితి దయనీయంగా ఉంది. పిల్లలను బడికి పంపాలంటే పోషకులు జంకుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు, పాలకులు ప్రత్యేక చొరవ తీసుకొని విద్యాలయాల్లో నెలకొన్న సమస్యలు తీర్చాలని కోరుతున్నారు.

సమస్యల పరిష్కారానికి చర్యలు - ఎ.రవీందర్‌రెడ్డి, డీఈవో, నిర్మల్‌

మన ఊరు- మన బడి పనులు పకడ్బందీగా, వేగవంతంగా జరిగేలా నిత్యం పర్యవేక్షిస్తున్నాం. మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రమాదకరంగా ఉన్న భవనాల జాబితా, వాటి మరమ్మతులు, శాశ్వత పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించాం. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా బడుల బలోపేతం కోసం, సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నాం.

ఖానాపూర్‌ మండలం బాదనకుర్తి యూపీఎస్‌ భవనం దశాబ్ధాల క్రితం నిర్మించింది కావడం, పైకప్పు దెబ్బతినడంతో వర్షాలకు గదులు ఊరుస్తున్నాయి. 139మంది విద్యార్థులు చదువుకుంటున్న ఇక్కడ ఎప్పుడు కూలుతుందోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. గ్రామస్థుల సహకారంతో ఏడాదికి రూ. 20వేలు అద్దె చెల్లిస్తూ నాలుగు గదులు కిరాయికి తీసుకున్నారు. గోడలపంపు ప్రాథమిక పాఠశాల స్లాబు పగుళ్లు తేలింది. గోడలు దెబ్బతిన్నాయి. వర్షాల సమయంలో కూలిపోయే దశలో ఉన్న బడికి తమ పిల్లలను పంపమని పోషకులు ఆందోళన నిర్వహించారు.

కడెం మండలం లింగాపూర్‌ జడ్పీఎస్‌ఎస్‌ భవనం శిథిలావస్థకు చేరింది. వరండాలో పైకప్పు పెచ్చులూడిపోయింది. ఎప్పుడు కూలుతుందో చెప్పలేని పరిస్థితి. దస్తూరాబాద్‌ జడ్పీ ఉన్నత పాఠశాల పరిస్థితి ఇలాగే ఉంది. దశాబ్ధాల క్రితం నిర్మించింది కావడంతో పెచ్చులూడి దెబ్బతింది. కూలిపోయే దశకు చేరినా కనీస మరమ్మతులు సైతం చేయడం లేదు.

పెంబి ప్రాథమిక పాఠశాలను ఏళ్లుగా శిథిల భవనంలోనే నిర్వహిస్తున్నారు. వర్షం కురిస్తే విద్యార్థులకు సెలవే అన్నట్టుగా తయారయ్యింది. పై కప్పు దెబ్బ తినడంతో గదుల్లోకి వర్షపు నీరు చేరుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని