logo

సినీ ఫక్కీలో భారీ చోరీ.. సుమారు 250 కిలోల లాకర్‌ ఎత్తుకెళ్లారు!

చలనచిత్రాల్లోని సన్నివేశాలకు ఏమాత్రం తీసిపోకుండా జరిగిన ఓ భారీ చోరీ మంగళవారం నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం బీరవెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పక్కా ప్రణాళిక ప్రకారం జరిగినట్లు భావిస్తున్న ఈ చోరీలో ఏకంగా నగదు దాచిన లాకర్‌నే ఎత్తుకెళ్లారు.

Updated : 12 Oct 2022 11:50 IST

 రూ. 10.78 లక్షల నగదు అపహరణ..

మ్యాక్స్‌ భవనం

సారంగాపూర్‌, న్యూస్‌టుడే : చలనచిత్రాల్లోని సన్నివేశాలకు ఏమాత్రం తీసిపోకుండా జరిగిన ఓ భారీ చోరీ మంగళవారం నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం బీరవెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పక్కా ప్రణాళిక ప్రకారం జరిగినట్లు భావిస్తున్న ఈ చోరీలో ఏకంగా నగదు దాచిన లాకర్‌నే ఎత్తుకెళ్లారు. 248 కిలోల బరువుండే లాకర్‌ను కిటికీలోంచి బయటకు తీసి కారులో తరలించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అందులో రూ.10,48,271ల నగదు ఉండగా వీటితో పాటు మరో కౌంటరులోని రూ.30 వేలను తీసుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీరవెల్లిలో 19ఏళ్ల కిందట రైతు పరస్పర సహకార పొదుపు పరపతి సంఘం(మ్యాక్స్‌)ను స్థానిక రైతులు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ నిత్యం పెద్దమొత్తంలో నగదు లావాదేవీలు జరుగుతుంటాయి. నగదు దాచేందుకు నిర్వాహకులు గోద్రేజ్‌ కంపెనీ లాకర్‌ను భవనంలో ఏర్పాటు చేసుకున్నారు. మంగళవారం ఉదయం 7 గంటలకు అందులో పనిచేసే ప్యాట సాయికుమార్‌, స్వీపర్‌ సాయన్నలు భవనం తలుపులు తెరచి చూడగా కిటికీ తొలగించి ఉంది. లాకర్‌ కనిపించలేదు. పక్క గదిలోని బీరువా తలుపులు తెరచి ఉన్నాయి. వెంటనే సారంగాపూర్‌ పోలీసులకు సమచారం అందించగా ఎస్‌ఐ ఎం.కృష్ణసాగర్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. డీఎస్పీ ఎల్‌.జీవన్‌రెడ్డి, సీఐలు వెంకటేశ్‌, శ్రీనివాస్‌, సీఐ రాంనర్సింహారెడ్డిలు సందర్శించారు. క్లూస్‌ టీం సభ్యులు వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. ఘటనా స్థలం నుంచి జాగిలం వంజర్‌ గ్రామ వైపున ఉన్న చర్చి వద్దకు వెళ్లి కాసేపు అక్కడే రోడ్డుపై చుట్టూరా తిరిగి నిలబడింది. పోలీసులు దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దిగారు. మ్యాక్స్‌ అధ్యక్షుడు లక్కడి గంగారెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
స్థానికుల పాత్రపై అనుమానం?!
మ్యాక్స్‌లో జరిగిన చోరీపై అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక్కడ ఇంత పెద్దమొత్తంలో నగదు ఉన్నట్లు ఎవరికీ తెలుసు? భవనంలో మూడు గదులుండగా నేరుగా లాకర్‌ ఉన్న గదిలోకి మాత్రమే దొంగలు ఎలా ప్రవేశించారు? తెరచిన కిటికీలోంచి సరిగ్గా లాకర్‌ బయటకు వస్తుందని ఎలా అంచనా వేశారు? 248 కిలోల బరువున్న లాకర్‌ను సునాయసంగా ఎలా బయటకు తీశారు? అక్కడి పరిస్థితిని గమనిస్తే సామాన్యులకు సైతం ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నలుగురు నుంచి ఎనిమిది మంది పాల్గొని ఉండొచ్చని, పలుమార్లు రెక్కీ నిర్వహించి వారికి అనుకూలమైన సమయంలో చోరీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. అయితే స్థానికులు తెలిపిన సమాచారం, సహాయంతోనే బయటి వ్యక్తులు చోరీ చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవనంలో మొత్తం 8 సీసీ కెమెరాలుండగా దుండగులు ఫుటేజీలు రికార్డు అయ్యే హార్డ్‌డిస్క్‌ను ఎత్తుకెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని