logo

దారి దోపిడీ

‘జిల్లాలో ఓ పార్టీ సమావేశం ఉంది. రెండు, మూడు వందల మంది హాజరవుతారు. వారిని తరలించడానికి భోజన ఏర్పాట్లకు అయ్యే ఖర్చు కోసం నేత చెక్‌పోస్టు సిబ్బందికి సమాచారం ఇస్తారు.

Updated : 04 Feb 2023 06:40 IST

వసూళ్లకు అడ్డాగా ‘వాంకిడి చెక్‌పోస్టు’

ఆర్టీఓ చెక్‌పోస్టు వద్ద ప్రైవేటు వ్యక్తులు

* ‘జిల్లాలో ఓ పార్టీ సమావేశం ఉంది. రెండు, మూడు వందల మంది హాజరవుతారు. వారిని తరలించడానికి భోజన ఏర్పాట్లకు అయ్యే ఖర్చు కోసం నేత చెక్‌పోస్టు సిబ్బందికి సమాచారం ఇస్తారు. వారి ఆదేశాలే మహా భాగ్యమని సదరు సిబ్బంది హుటాహుటిన సభలు, సమావేశాలకు అయ్యే ఖర్చు, భోజన ఏర్పాట్ల వ్యయాన్ని భరిస్తారు.’

* ‘మండలంలో శాంతి భద్రతలను రక్షించే పోలీసు అధికారులకు కూడా నెలకింత అని ఠంఛనుగా ముట్టజెబుతారు. వారితో పాటు స్థానిక ద్వితీయశ్రేణి నాయకులు, ప్రెస్‌ అని బోర్డు పెట్టుకుని తిరిగే వ్యక్తులు ఇక్కడికి వచ్చి నెలనెలా డబ్బులు తీసుకుంటారు.’ ఎవరు అడిగినా కాదనకుండా ఇచ్చేస్తున్నారు. వారి పనికి అడ్డురాకుండా ఉంటే చాలు.

ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌: జిల్లాలో చిన్నాపెద్దా తేడా లేకుండా అధికారులు, నాయకులకు ముడుపులే అంత మొత్తంలో ఇస్తున్నారంటే వారి వసూళ్లు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర సరిహద్దు వాంకిడి చెక్‌పోస్టులో ఏటీకేడు అక్రమ వసూళ్లు పెరుగుతున్నాయి. అధికారులు తమ చేతులకు మట్టి అంటకుండా దర్జాగా ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని దందా కొనసాగిస్తున్నారు. ఒక్క రోజే రూ.లక్ష వరకు లెక్కల్లోకి రాని సొమ్ము కూడ పెడుతున్నారంటే అవినీతి ఏ విధంగా ఉందో తెలుస్తుంది. ఎక్సైజ్‌ చెక్‌పోస్టులో ఎప్పటి మాదిరిగానే ప్రతీ వాహనానికి రూ.10 వసూలు చేయడం జరుగుతూనే ఉంది. ఈ దారి దోపిడీని నిలువరించాల్సిన అధికారులు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదు.

వాంకిడి మండల సరిహద్దు వద్ద అటవీ, మార్కెట్, ఆబ్కారీతో పాటు, ఆర్టీఓ చెక్‌పోస్టు ఉంది. ఉత్తర భారత దేశ రాష్ట్రాలతో పాటు, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలకు ఈ మార్గం గుండానే నిత్యం 800 నుంచి 1050 వాహనాల వరకు రాకపోకలు సాగిస్తాయి. వే బిల్లు లేకుండా, పరిమితికి మించి వాహనాల్లో సరకును తరలించే లారీలను గుర్తించి ఆర్టీఓ చెక్‌పోస్టు జరిమానా విధించాలి. అందుకు భిన్నంగా ఇక్కడ అన్నిరకాల పత్రాలు ఉన్నా రూ.500 నుంచి రూ.1500, రూ.2 వేల వరకు సరకు, లోడ్‌ను అనుసరించి చోదకులు ఇవ్వాల్సిందే. తరచూ ఈ మార్గంలో వెళతాం, ఎందుకు గొడవలే అని పంటి కింద బాధను అనుభవిస్తూ చోదకులు అడిగినంత సమర్పించుకుంటున్నారు.

20 మంది వరకు ప్రైవేటు వ్యక్తులు..

వాహనాలు ఆపి చెక్‌పోస్టులో సిబ్బంది డబ్బులు తీసుకునే వరకు అంతటా ప్రైవేటు వ్యక్తులే ఉన్నారు. వీరికి రోజుకు ఒక్కొక్కరికి రూ.300 నుంచి రూ.500 వరకు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 20 మంది వరకు ప్రైవేటు వ్యక్తులు పనిచేస్తున్నారు. కొందరు స్థానికులు కాగా, మరికొందరు అధికారుల బంధువులు, వాహన డ్రైవర్లు ఉన్నారు. నవంబర్‌ 2017లో అవినీతి నిరోధకశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీ చేసి, ఓ అట్ట పెట్టేలో చోదకుల నుంచి అక్రమంగా వసూలు చేసి ఉంచిన రూ.30 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి గత ఆరు సంవత్సరాలుగా ఇక్కడ ఎలాంటి తనిఖీలు లేకపోవడం గమనార్హం.


ప్రతీ వాహనం నుంచి రూ.10 వసూలు..

వాహన చోదకుడి నుంచి డబ్బులు తీసుకుంటున్న వ్యక్తి

ఆబ్కారీ శాఖ చెక్‌పోస్టులో ఓ అధికారి, ఓ ప్రైవేటు వ్యక్తి రహదారిపై ఉన్నారు. వాహనం రాగానే ప్రైవేటు వ్యక్తి రహదారిపైకి వెళ్లి డబ్బులు అడుగుతున్నారు. అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడితే భారీగా వసూళ్లు ఉంటాయి. ఒక్కో వాహనం నుంచి రూ.10 చొప్పున తీసుకున్నా.. నిత్యం 800 వాహనాల వరకు అనుకున్నా రూ.8 వేలు వసూలవుతున్నట్లు. ఈ లెక్కన నెలకు రూ.2.40 లక్షలు అక్రమంగా సంపాదిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ చెక్‌పోస్టు రహదారి అవతల వైపు ఉంది. ఆబ్కారీ చెక్‌పోస్టు ఉన్న విషయం సైతం చోదకులు గమనించరు. ఈ నేపథ్యంలో రోడ్డుపైనే వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేయడం వల్ల ప్రమాదం పొంచి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు