logo

అక్కరకు రాని ఆరోగ్య ఉపకేంద్రాలు!

పల్లె ప్రాంతవాసులకు మెరుగైన వైద్యం అందిస్తారనే ఆశయం నెరవేరడంలేదు. గ్రామీణ ప్రాంత ఆసుపత్రులపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్నా.. ఆశించినస్థాయిలో వైద్యం సేవలందడంలేదు.

Published : 24 Mar 2023 03:31 IST

ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌: పల్లె ప్రాంతవాసులకు మెరుగైన వైద్యం అందిస్తారనే ఆశయం నెరవేరడంలేదు. గ్రామీణ ప్రాంత ఆసుపత్రులపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్నా.. ఆశించినస్థాయిలో వైద్యం సేవలందడంలేదు. అయిదారేళ్ల కిందట నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్రాలు నేటికీ నిరుపయోగంగా ఉండి క్రమంగా  శిథిలావస్థకు చేరుకోవడమే దీనికి నిదర్శనం. ఈ కేంద్రాలు ప్రజలకు ఏనాడూ అక్కరకు రాలేదు. జిల్లాకు రెండేళ్ల క్రితం కొత్తగా 39 ఆరోగ్య ఉప కేంద్రాలు మంజూరు కాగా.. 26 ఉపకేంద్రాల పనులు పూర్తయ్యాయి. కొత్తవి సైతం ప్రారంభానికి నోచుకోలేకపోతున్నాయి. పల్లె దవాఖానాలుగా మార్చినా, సిబ్బందిని నియమించకపోవడంతో ఈ భవనాల కోసం వెచ్చించిన రూ.కోట్లు బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారాయి. జ్వరాలు విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలోనైనా తగిన సిబ్బంది, వైద్యులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 108 ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి. కాగజ్‌నగర్‌లో రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉండగా.. 46 మంది వైద్యులు అవసరం కాగా, 24 ఖాళీలు ఉన్నాయి. ఆరోగ్య ఉపకేంద్రాలను పల్లె దవాఖానాలుగా మార్చారు. ఇంతకు ముందు నిర్మించి రంగులు వేసి ప్రారంభించకుండా ఉన్న వాటికి, మళ్లీ రంగులు వేసి నిధుల దుబారాకు తెర తీశారు. ఇంత చేసినా.. ఇక్కడ మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లను నియమించకపోవడంతో.. చిన్నపాటి రోగాలకు సైతం సుదూరంలో ఉన్న మండల కేంద్రాలు, పట్టణాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. ఇవి అందుబాటులో వస్తే మారుమూల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలందే వీలవుతుంది.
ఇదీ పరిస్థితి..

* జైనూర్‌, సిర్పూర్‌(యు), లింగాపూర్‌ మండలాలు పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలు. జైనూర్‌ సీహెచ్‌సీలో ఎనిమిది మంది వైద్యులు ఉండాలి కానీ ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. ఆసిఫాబాద్‌ వైద్యుడికే ఉషేగాం బాధ్యతలు అప్పగించారు. లింగాపూర్‌, సిర్పూర్‌(యు)లలో ఇదే పరిస్థితి. జైనూర్‌ సీహెచ్‌సీలో గర్భిణులకు చేయాల్సిన స్కానింగ్‌ సక్రమంగా చేయడం లేదు. పక్షం రోజులకు, నెలకోసారి చేయడంతో స్కానింగ్‌ కోసం మహిళలు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి.

* సిర్పూర్‌(టి) సీహెచ్‌సీ కేవలం రోగులను రిఫర్‌ చేయడానికే పనిచేస్తోందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇక్కడ ఆరుగురు వైద్యులు పనిచేయాల్సి ఉండగా.. కేవలం ముగ్గురు ఉన్నారు. స్టాఫ్‌ నర్సులు 29, ల్యాబ్‌ టెక్నీషియన్లు 7, బహుళార్థ ఆరోగ్య కార్యకర్తలు 69 పోస్టులు సైతం ఏళ్ల తరబడి ఖాళీలుగానే ఉన్నాయి.


రంగులు వేసి వదిలేసి!

జిల్లా కేంద్రంలోని తారకరామనగర్‌లో 2019లో రూర్బన్‌ నిధులు రూ.16.50 లక్షలతో నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్ర భవనమిది. నిర్మాణం, రంగులు వేయడం పూర్తయినా ఇంకా ప్రారంభించలేదు. నాలుగేళ్ల నుంచి నిరుపయోగంగా ఉండడంతో కిటికీలు, తలుపులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ కేంద్రం తాగుబోతులు, జూదరులకు అడ్డాగా మారింది. ఇదే భవనానికి తాజాగా పల్లె దవాఖానాగా మార్చి మళ్లీ రంగులు వేసి వదిలేశారు. ఇప్పుడైనా సిబ్బందిని నియమిస్తే ఆరోగ్య సేవలు అందుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


అలంకారప్రాయంగానే..

ఆసిఫాబాద్‌ మండలంలోని ఈదులవాడలో పది సంవత్సరాల కిందట రూ.7.50 లక్షలు వెచ్చించి నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్రమిది. ప్రారంభించకపోవడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. జిల్లాలో ఈ విధంగా ఎనిమిది వరకు ఆరోగ్య ఉపకేంద్రాలు పాతవి అక్కరకు రాకుండా పోతుండగా.. కొత్తగా నిర్మించినవి సైతం ఏళ్లనుంచి అలంకారప్రాయంగా ఉన్నాయి.


వినియోగంలోకి తెస్తాం..
సుధాకర్‌నాయక్‌, అదనపు డీఎంహెచ్‌ఓ

పల్లె దవాఖానాల్లా మార్చిన ఉపకేంద్రాలలో త్వరలోనే సిబ్బందిని నియమిస్తాం. వీటిని వినియోగంలోకి తెచ్చి పల్లె ప్రజలకు ఆరోగ్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని