logo

నాలుగోసారికి వరించిన విజయం

ఆదిలాబాద్‌ శాసనసభ బరిలో మూడుసార్లు పోటీపడి ఓటమి చెందిన భాజపా అభ్యర్థి పాయల్‌ శంకర్‌ ఎట్టకేలకు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Published : 04 Dec 2023 02:59 IST

పాలనాప్రాంగణం, ఆదిలాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే : ఆదిలాబాద్‌ శాసనసభ బరిలో మూడుసార్లు పోటీపడి ఓటమి చెందిన భాజపా అభ్యర్థి పాయల్‌ శంకర్‌ ఎట్టకేలకు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తన ప్రత్యర్థి భారాస అభ్యర్థి జోగు రామన్నపై 6,692 ఓట్ల ఆధిక్యం సాధించారు. నియోజకవర్గంలో పోస్టల్‌ ఓట్లతో కలిపి మొత్తం 1,88,658 ఓట్లు పోల్‌ కాగా భాజపాకు 67,608 (35.84శాతం), భారాసకు 60,916 (32.29), కాంగ్రెస్‌ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డికి 47,724 (25.30) ఓట్లు వచ్చాయి. మొత్తం 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు కొనసాగింది. మూడు రౌండ్లు మినహా మిగిలిన 18 రౌండ్లలో భాజపా అభ్యర్థి ఆధిక్యత కొనసాగింది. భారాస అభ్యర్థి జోగు రామన్నకు 2, 14, 16, 17, 21వ రౌండ్లలో ఆధిక్యం రాగా మిగిలిన రౌండ్లలో భాజపా జోరు కొనసాగింది. కాంగ్రెస్‌ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డికి 4వ రౌండ్‌లో 165ఓట్ల ఆధిక్యం వచ్చింది. కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి సీఆర్‌ఆర్‌ మేనల్లుడు అల్లూరి సంజీవరెడ్డికి మొత్తంగా 1,946 ఓట్లు మాత్రమే సాధించారు. నియోజకవర్గంలో 25 మంది అభ్యర్థులు పోటీపడగా ప్రధాన పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి.


 అనిల్‌ జాదవ్‌దే హవా

నేరడిగొండలో అనిల్‌ జాదవ్‌ ఇంటి ముందు నృత్యం చేస్తున్న మహిళలు

ఇచ్చోడ, బోథ్‌, న్యూస్‌టుడే : బోథ్‌ నియోజకవర్గంలో హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన భారాస, భాజపా, కాంగ్రెస్‌లు ఉవ్వెత్తున ప్రచారం నిర్వహించాయి. చివరికి ప్రజలు భారాసకు పట్టం కట్టారు. నియోజకవర్గంలో మొత్తం 2,08,048 మంది ఓటర్లుండగా 1,72,397 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీటితో పాటు బ్యాలెట్‌ ఓట్లు 1,700 మంది ఉద్యోగులు తమ ఓటు వేశారు. ఆదివారం ఎన్నికల ఫలితాల శైలి ఉత్కంఠగా సాగింది. ఆది నుంచి భారాస అభ్యర్థి అనిల్‌ జాదవ్‌ అన్ని రౌండ్లలో ఆధిక్యం కనబరిచారు. అనిల్‌ జాదవ్‌కు 76,792 ఓట్లు రాగా.. 22,800 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. భాజపా అభ్యర్థి సోయం బాపురావు 53,992, కాంగ్రెస్‌ అభ్యర్థి ఆడె గజేందర్‌ 32,797 ఓట్లను పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని