logo

లక్ష్యానికి మించి ‘ఉపాధి’ పనులు

మండుటెండల్లో ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సంవత్సరం బడ్జెట్‌్ ప్రణాళికలు మించి పనులు చేశారు. 2023-24లో మొత్తం 36.58 లక్షల పని దినాలు అంచనాతో ప్రణాళికలు రూపొందించారు.

Published : 28 Mar 2024 03:37 IST

మండుటెండలను లెక్క చేయకుండా కూలీల హాజరు
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ అర్బన్‌

పనులు పరిశీలిస్తున్న డీఆర్డీఓ సాయన్న

మండుటెండల్లో ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సంవత్సరం బడ్జెట్‌్ ప్రణాళికలు మించి పనులు చేశారు. 2023-24లో మొత్తం 36.58 లక్షల పని దినాలు అంచనాతో ప్రణాళికలు రూపొందించారు. కూలీలు పనులు చేసేందుకు ముందుకు రావడంతో ఇప్పటికే 41.74 లక్షల పని దినాలు కల్పించారు. జిల్లాలో లక్ష్యానికి మించి 114 శాతంగా నమోదైంది. రాష్ట్రంలో కూలీలకు పనులు కల్పించడంలో జిల్లా రెండో స్థానంలో నిలిచింది. గడిచిన రెండు నెలల్లోనే ఎక్కువ శాతం మంది పనులకు రావడం గమనార్హం. జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి జి.సాయన్న ఉపాధి పనులను ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, మండలాల వారీగా కూలీల సంఖ్యను పర్యవేక్షిస్తున్నారు. అయితే కూలీ డబ్బులు చెల్లించడంలో ఆలస్యమవుతున్నా ఈ స్థాయిలో పనితీరు కనబరిస్తే ఎప్పటికప్పుడు డబ్బులు ఖాతాల్లో జమ చేస్తే మరింత మంది కూలీలు పనులు వచ్చేందుకు ఆసక్తి చూపుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రోజుకు సగటు కూలీ రూ.203

గ్రామీణప్రాంతాల్లో కందకాల తవ్వకం, చెరువుల్లో పూడికతీత, వ్యవసాయ భూముల అభివృద్ధి, హరితహారం తదితర పనులు చేపడుతున్నారు. అందరూ దాదాపు ఉదయం 8 గంటలకు క్షేత్రస్థాయికి వెళ్లి 11 గంటల వరకే చాలామంది తిరుగుముఖం పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన దినసరి కూలీ రూ.272 ఉంది. అయితే నిర్దేశిత కొలతల ప్రకారం పనులు చేయకపోవడంతో సగటున రూ.203 వేతనం అందుతోంది. జాబ్‌కార్డుపై ఎంతమంది సభ్యులున్నా కుటుంబానికి 100 రోజులు పని కల్పించాల్సి ఉంది. జిల్లాలో మొత్తం 1.72 లక్షల జాబ్‌కార్డులు, 3.46 లక్షల మంది కూలీలు నమోదై ఉన్నా క్రియాశీల జాబ్‌కార్డులు 1.15 లక్షలు, పనులకు వచ్చే కూలీలు 2.17 లక్షల మందే ఉన్నారు. అందులోనూ కొంతమంది వంద రోజులు పూర్తిగా పనులకు రాకుండా అడపాదడపా వస్తున్నారు. ఇప్పటి వరకు 2,670 కుటుంబాలు సంపూర్ణంగా పని దినాలను వినియోగించుకున్నాయి. రూ.85.95 కోట్ల విలువైన పనులు జరిగాయి. ఇంకా దాదాపు రూ.14కోట్ల డబ్బులు కార్మికుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది.


కూలీలు ముందుకు రావాలి

జి.సాయన్న, డీఆర్డీఓ

ఇతర జిల్లాలతో పోలిస్తే ఆదిలాబాద్‌ జిల్లాలో ఉపాధి పనులు చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయ, అటవీ భూములు ఎక్కువగా ఉండటంతో ఎక్కడా లోటు లేకుండా పనులు కల్పించవచ్చు. కూలీలు ముందుకు రావాలి. వేతనాల చెల్లింపుల విషయంలో కొంత ఆలస్యమవుతోంది. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. వచ్చే సంవత్సరం 42 లక్షల పని దినాలు లక్ష్యంగా పెట్టుకున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని