logo

అభ్యర్థులకు కీలకం.. నామపత్రాల ఘట్టం

పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని పట్టణాలు, గ్రామాల్లో లోక్‌సభ ఎన్నికల పోరు క్రమేణా జోరందుకుంటుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు, కీలక నేతలు సమావేశాలు నిర్వహిస్తూ గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు.

Published : 18 Apr 2024 03:23 IST

చెన్నూరు, న్యూస్‌టుడే: పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని పట్టణాలు, గ్రామాల్లో లోక్‌సభ ఎన్నికల పోరు క్రమేణా జోరందుకుంటుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు, కీలక నేతలు సమావేశాలు నిర్వహిస్తూ గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ పోరులో తొలి ఘట్టమైన నామినేషన్ల పర్వానికి గురువారం తెరలేవనుంది. బరిలో నిలిచే అభ్యర్థులు ఏ మాత్రం పొరపాటు చేసినా నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే అవకాశముంది.  లోక్‌సభ ఎన్నికల సమరానికి కేంద్ర ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. నేటి నుంచి 25 వరకు నామపత్రాలు స్వీకరిస్తారు.

ఏఆర్‌ఓ, తహసీల్దార్‌ కార్యాలయాల్లో,,

ఎన్నికల క్రతువులో నామినేషన్ల ఘట్టం కీలకమవటంతో అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నామపత్రాలు అందుబాటులో ఉంచనున్నారు. ఆయా నియోజకవర్గ సహాయ రిటర్నింగ్‌ అధికారి(ఏఆర్‌ఓ) కార్యాలయంతో పాటు తహసీల్దార్‌ కార్యాలయాల్లోనూ నామపత్రాలు లభ్యమవుతాయి. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు ఆయా కార్యాలయాలకు నేటి నుంచి ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో వెళ్లి నామపత్రాలు తీసుకోవచ్చు. తెలుగు, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంటాయి. ఎన్నికల నియమావళి ప్రకారం ఫాం-2ఏను లోక్‌సభ ఎన్నికల నామపత్రంగా పేర్కొంటారు.

రిటర్నింగ్‌ అధికారికి సమర్పించాల్సిందే..

ఎన్నికల బరిలో నిలవాలనుకునేవారు నామపత్రాలు పూరించిన అనంతరం సంబంధిత లోక్‌సభ స్థానం రిటర్నింగ్‌ అధికారి(ఏఆర్‌ఓ)కి అందించాలని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, పెద్దపల్లి పార్లమెంటు స్థానాలకు పోటీ చేయాలనుకునే వారు అక్కడి రిటర్నింగ్‌ అధికారికి నామపత్రాలు అందజేయాలి. నామపత్రాన్ని అభ్యర్థి లేదా అభ్యర్థి ప్రతిపాదకులు ఎవరైనా సమర్పించవచ్చు. ఏఆర్‌ఓ, తహసీల్దార్‌ కార్యాలయాల్లో నామపత్రాలు ఇవ్వటంతోపాటు అభ్యర్థులకు వాటిలో ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత ఏఆర్‌ఓలు నివృత్తి చేస్తారని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.

ఆస్తుల వివరాలన్నీ రాయాలి

అఫిడవిట్‌లో స్థిర, చరాస్తుల వివరాలను తప్పనిసరిగా పొందుపరచాలి. బ్యాంకు ఖాతాల్లో నగదు, డిపాజిట్లు, సేవింగ్స్‌, బీమా పాలసీలు, అప్పుల వివరాలు నమోదు చేయాలి. చేతిలో ఉన్న నగదును కూడా పేర్కొనాలి. ఆభరణాలు, వాహనాలు, వ్యవసాయ భూములు, వాణిజ్య సముదాయాలు, నివాస స్థలాల వివరాలను ప్రస్తావించడంతో పాటు అవి ఎలా వచ్చాయో కూడా రాయాలి. స్థిరాస్తుల ప్రస్తుత మార్కెట్‌ విలువ చూపాలి. అభ్యర్థితో పాటు కుటుంబ సభ్యుల పేరిట రుణాలు, వాటి వివరాలు, వారి ఆదాయ మార్గాలు, ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల్లో కాంట్రాక్టులుంటే వాటి వివరాలు నమోదు చేయాలి.

గరిష్ఠంగా నాలుగు సెట్లు

అభ్యర్థి లేదా వారి తరఫున గరిష్ఠంగా నాలుగు సెట్ల నామపత్రాలు దాఖలు చేయొచ్చు. ఒకే స్థానం నుంచి నాలుగు సెట్ల నామపత్రాలు సమర్పించినా ఒక్కసారి మాత్రమే ధరావత్‌(డిపాజిట్‌) చెల్లించాల్సి ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవటానికి డిపాజిట్‌ చేయాల్సిన మొత్తం రూ.25 వేలు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు రూ.12,500 చెల్లించాలి. ఏదైనా సెట్‌లో పొరపాట్లు దొర్లితే తిరస్కరణకు గురికాకుండా ఉండేందుకు అభ్యర్థులు నాలుగుసెట్లు దాఖలు చేసే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని