Israel: డీల్‌ కుదిరినా.. కుదరకపోయినా రఫాపై దండయాత్రే: నెతన్యాహు

Israel: హమాస్‌కు మిగిలి ఉన్న రఫా ప్రాంతంపై దండయాత్ర తప్పదని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా ఇది జరుగుతుందన్నారు.

Published : 30 Apr 2024 19:09 IST

జెరూసలెం: గత ఏడు నెలలుగా జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్‌-హమాస్‌ (Israel) మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్‌ దేశాలు తీవ్రంగా చర్చలు జరుపుతున్నాయి. ఈ పరిణామాల వేళ ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్‌కు ఇంకా పట్టున్న రఫా (Rafah) నగరంలోకి తమ దళాలు అడుగుపెడతాయన్నారు. సంధి ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా ఈ నగరంపై  తమ దండయాత్ర ఆగదని తేల్చి చెప్పారు.

‘‘రఫాలో హమాస్‌ బెటాలియన్లను నాశనం చేయాలంటే మేం ఆ నగరంలోకి ప్రవేశించాల్సిందే. బందీల విడుదల కోసం కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా, జరగకపోయినా మా దాడులు కొనసాగుతాయి. ఈ యుద్ధంలో మేం సంపూర్ణ విజయం సాధించాలనుకుంటున్నాం’’ అని నెతన్యాహు మంగళవారం వెల్లడించారు. రఫాలో గ్రౌండ్‌ ఆపరేషన్‌ కోసం తమ జాతీయ పాలక భాగస్వాముల నుంచి కూడా ప్రధాని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

40 రోజుల కాల్పుల విరమణ!

గాజాలో 40 రోజుల కాల్పుల విరమణకు జరుగుతున్న సంధి ప్రయత్నాలు కీలక దశకు చేరుకున్నాయి. దీనిపై టెల్‌అవీవ్‌ సుముఖత వ్యక్తం చేయగా.. సంధి ప్రతిపాదనలను అమెరికా, ఈజిప్టు, ఖతార్‌ దేశాల ప్రతినిధులు హమాస్‌కు పంపినట్లు సోమవారం వార్తలు వచ్చాయి. ఒప్పందంలో భాగంగా కొంతమంది బందీలను కూడా విడుదల చేసే అవకాశమున్నట్లు తెలిసింది. అయితే, ఓవైపు కాల్పుల విరమణపై ప్రయత్నాలు జరుగుతున్నా ఇజ్రాయెల్‌ రఫాపై తన దాడులను ఆపలేదు. సోమవారం జరిపిన గగనతల దాడుల్లో మరో 22 మంది పాలస్తీనీయన్లు మృతి చెందారు.

గతేడాది అక్టోబరు నుంచి గాజాలో ఐడీఎఫ్‌ దళాలు దాడులు చేయడంతో వేలాదిమంది పాలస్తీనీవాసులు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పుడు ఈ నగరంలోనూ గ్రౌండ్‌ ఆపరేషన్‌కు ఇజ్రాయెల్‌ సైన్యం సిద్ధమవుతోంది. అయితే, రఫాలో దాడులపై అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు