icon icon icon
icon icon icon

Lok Sabha Polls: దిల్లీలో సుష్మా స్వరాజ్‌ కుమార్తె నామినేషన్‌.. బాన్సురీ ఆస్తుల విలువ ఎంతంటే?

భాజపా అభ్యర్థి, దివంగత నేత సుష్మా స్వరాజ్‌ కుమార్తె బాన్సురీ స్వరాజ్‌ నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా ఆమె ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించారు.

Published : 01 May 2024 00:05 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ (Lok Sabha Elections) దేశ రాజధాని నగరంలో నామినేషన్ల జోరు కొనసాగుతోంది. దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సురి స్వరాజ్‌తో పాటు 13మంది మంగళవారం నామినేషన్లు వేశారు. న్యూదిల్లీ నుంచి భాజపా అభ్యర్థిగా రేసులో ఉన్న బాన్సురీ ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. మొత్తంగా రూ.19 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉండగా.. వీటిలో రూ.11.27 కోట్లు చరాస్థులు, రూ.8 కోట్లు విలువైన స్థిరాస్తులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. అలాగే, హరియాణాలోని పాల్వాల్‌లో రూ.99.34 లక్షల విలువైన ఉమ్మడి ఆస్తిలో 1/6వ వంతుతో పాటు దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెండు ఫ్లాట్లు, హేలీ రోడ్‌లో ఒక ఫ్లాట్‌ ఉన్నాయని తెలిపారు. 2023లో కొనుగోలు చేసిన మెర్సిడెస్‌ బెంజ్‌ కారుతో పాటు రెండు సొంత వాహనాలు కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. 

ఏపీలో కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల.. ముఖ్యాంశాలివే..

వృత్తి రీత్యా న్యాయవాది అయిన 40 ఏళ్ల బాన్సురి 2022-23 ఐటీ రిటర్నుల్లో తన ఆదాయాన్ని రూ.68.28లక్షలుగా పేర్కొన్నారు. వార్‌విక్‌ యూనివర్సిటీ నుంచి ఆంగ్ల సాహిత్యంలో బీఏ (ఆనర్స్‌) పూర్తిచేసిన ఆమె.. న్యాయవిద్యనభ్యసించడానికి లండన్‌ వెళ్లారు. అక్కడి ‘బీపీపీ లా స్కూల్‌’లో న్యాయవిద్య పూర్తిచేసి .. ‘ఇన్నర్‌ టెంపుల్‌’ కోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్‌ చేసి బారిస్టర్‌గా అర్హత సాధించారు. ఆపై ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన సెయింట్‌ క్యాథరిన్‌ కాలేజీ నుంచి 2009లో మాస్టర్స్‌ పూర్తి చేసిన ఆమె న్యాయవాది వృత్తిలో రాణిస్తూ ఇటీవల క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. దిల్లీలో మొత్తం ఏడు లోక్‌సభ నియోజకవర్గాలకు మే 25న ఎన్నికలు జరగనుండగా..  నిన్న మొదలైన నామినేషన్ల పర్వం మే 6 వరకు కొనసాగనుంది. ఇప్పటివరకు మొత్తంగా 26మంది నామినేషన్లు వేసినట్లు దిల్లీ చీఫ్ ఎలక్టోరల్‌ అధికారి వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img