Lucknow vs Mumbai: స్టాయినిస్‌ అర్ధశతకం.. ముంబయిపై లఖ్‌నవూ విజయం

ఐపీఎల్‌-2024లో లఖ్‌నవూ ఆరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Updated : 01 May 2024 00:37 IST

లఖ్‌నవూ: ముంబయికి మరో హ్యాట్రిక్‌ ఓటమి. సొంతగడ్డపై లఖ్‌నవూ 4 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి 144 పరుగులకే పరిమితం కాగా.. అనంతరం బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మార్కస్‌ స్టాయినిస్‌ (62: 45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకంతో చెలరేగాడు. కెప్టెన్‌ కెఎల్‌ రాహుల్‌ (28: 22 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌), దీపక్‌ హుడా (18: 18 బంతుల్లో), పూరన్‌ (14*) పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో హార్దిక్‌ పాండ్య రెండు వికెట్లు తీయగా, తుషారా, కొయిట్జీ, నబీ ఒక్కో వికెట్‌ తీశారు.

స్టాయినిస్‌ దూకుడు..

తొలి ఓవర్‌లోనే అర్షిన్‌ కుల్‌కర్ణి వికెట్‌ కోల్పోయిన లఖ్‌నవూ ఇన్నింగ్స్‌ను ఫేలవంగా ఆరంభించింది. మూడు ఓవర్లలో ఆ జట్టు కేవలం 11 పరుగులే చేసింది. అనంతరం కేఎల్‌ రాహుల్‌తో కలిసి స్టాయినిస్‌ మెళ్లిగా ఇన్నింగ్స్‌ నిర్మించాడు. కొయిట్జీ వేసిన నాలుగో ఓవర్లో స్టాయినిస్‌ వరుసగా రెండు ఫోర్లు బాదడంతో లఖ్‌నవూ స్కోర్‌ బోర్డు వేగం అందుకుంది. తుషారా వేసిన ఐదో ఓవర్లో కేఎల్‌ రాహుల్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. మూడు ఫోర్లు, ఓ సిక్స్‌ బాదడంతో ఈ ఓవర్లో మొత్తం 20 పరుగులు వచ్చాయి. 6 ఓవర్లు ముగిసే సరికి లఖ్‌నవూ ఒక వికెట్ నష్టానికి 52 పరుగులతో నిలిచింది. హార్దిక్‌ వేసిన 8వ ఓవర్లో నబీ క్యాచ్‌ పట్టడంతో రాహుల్‌ ఔటయ్యాడు. 10 ఓవర్లు ముగిసే సరికి 79 పరుగులతో నిలిచిన లఖ్‌నవూ.. లక్ష్యాన్ని నెమ్మదిగా కరిగించుకుంటూ వెళ్లింది. 14వ ఓవర్లో స్టాయినిస్‌ అర్ధశతకం చేశాడు. హార్దిక్‌ వేసిన 15వ ఓవర్‌ తొలి బంతికి దీపక్‌ హుడా బుమ్రాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే వరుసగా ఫోర్‌, సిక్స్‌ బాది జోరుమీదున్న స్టాయినిస్‌ వెనుదిరిగాడు. చివరి మూడు ఓవర్లలో లఖ్‌నవూ విజయ సమీకరణం 22 పరుగులుగా మారింది. 18వ ఓవర్‌ తొలి బంతికి టర్నర్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌ తొలి బంతికే రెండో పరుగు తీసే క్రమంలో బదోనీ ఔటయ్యాడు. 19వ ఓవర్‌లో మొత్తం 10 పరుగులు వచ్చాయి. ఇక చివరి ఓవర్లో లక్ష్యం 3 పరుగులు కాగా, తొలి బంతికి రెండు పరుగులు వచ్చాయి. రెండో బంతికి పూరన్‌ సింగిల్‌ తీయడంతో లఖ్‌నవూ విజయతీరాలకు చేరింది. 

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ముంబయి స్వల్ప స్కోర్‌కే పరిమితం అయింది. నేహాల్‌ వధేరా (46: 41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌. టిమ్‌ డేవిడ్‌ (35*: 18 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌) చెలరేగగా, ఇషాన్‌ కిషన్‌ (32: 36 బంతుల్లో 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. రోహిత్‌ శర్మ (4), సూర్యకుమార్‌ యాదవ్‌ (10), తిలక్‌ వర్మ (7), హార్దిక్‌ పాండ్య (0) దారుణ ప్రదర్శన చేశారు. లఖ్‌నవూ బౌలర్లలో మోసిన ఖాన్‌ రెండు వికెట్లు తీయగా, స్టాయినిస్‌, నవీనుల్‌ హక్‌, మయాంక్‌ యాదవ్‌, రవి బిష్ణోయ్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

ఈ విజయంతో లఖ్‌నవూ ఆరు విజయాలతో ప్లేఆఫ్స్‌కు అవకాశాలు మెరుగుపరుచుకోగా.. ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7 ఓటములతో ముంబయి ప్లే ఆఫ్స్‌ అవకాశాలు దాదాపు కోల్పోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని