logo

పంచ్‌లతో పతకాలు

ఉమ్మడి జిల్లాలో కరాటేను పరిచయం చేసిన వారిలో చెప్పుకోదగ్గ మాస్టర్‌ చుక్క ధర్మరాజ్‌. సుమారు 35 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రస్థానం నేటికీ ఆయన శిష్యులు కొనసాగిస్తున్నారు.

Published : 19 Apr 2024 06:12 IST

కరాటేలో నైపుణ్యం.. రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు

నిర్మల్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో కరాటేను పరిచయం చేసిన వారిలో చెప్పుకోదగ్గ మాస్టర్‌ చుక్క ధర్మరాజ్‌. సుమారు 35 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రస్థానం నేటికీ ఆయన శిష్యులు కొనసాగిస్తున్నారు. తర్ఫీదు పొందిన వారు నాలుగు జిల్లాల పరిధిలో వేల సంఖ్యలో ఉంటారు. జపాన్‌ కరాటే అసోసియేషన్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఇంటర్నేషనల్‌ బ్లాక్‌బెల్ట్‌ నాలుగో డిగ్రీ సాధించిన ఘనత ఆయనది. దురదృష్టవశాత్తు గత ఏడాది సెప్టెంబరులో ధర్మరాజ్‌ మృతి చెందారు. జపాన్‌ కరాటే అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తేజేందర్‌సింగ్‌ భాటియా, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొండా శ్రీకాంత్‌, అమ్ముల భూషణ్‌, సభ్యులు, శిక్షకులు నిత్యం విద్యార్థులకు కరాటేలో మెలకువలు నేర్పుతూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్మల్‌ ఖ్యాతి చాటుతున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 4వేల మంది శిక్షణ పొందుతున్నారు. వీరిలో జిల్లా కేంద్రానికి చెందిన పలువురు ఈ క్రీడలో  ప్రత్యేకత కనబరుస్తూ ముందుకెళ్తున్నారు.


ఏడేళ్లుగా..

ఎం.హాసినికి ప్రశంసాపత్రం అందిస్తున్న జిల్లా అదనపు పాలనాధికారి ఫైజాన్‌ అహ్మద్‌

ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన ఎం.హాసిని మూడో తరగతి చదువుతున్న సమయంలో కరాటేపై మక్కువ పెంచుకుంది. పలు రాష్ట్ర స్థాయి టోర్నీల్లో పాల్గొని పతకాలు, ప్రశంసాపత్రాలు అందుకుంది. కుమితే (స్పైరింగ్‌)లో నేర్పరి. తొమ్మిదో తరగతిలో ఉన్న సమయంలో బ్లాక్‌బెల్ట్‌ పొందింది. పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో గత ఏడాది నిర్వహించిన రాష్ట్ర టోర్నీలో స్వర్ణ పతకం సాధించి డిసెంబరు 16- 19 వరకు దిల్లీలో జరిగిన నేషనల్‌లోనూ తనదైన ప్రతిభ కనబర్చింది.


చదివేది అయిదో తరగతి.. ప్రతిభ అమోఘం

సాధించిన పతకాలతో ఎస్‌.కె.అమన్‌

ఎస్‌.కె.అమన్‌ ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నాడు. రెండేళ్లుగా కరాటే శిక్షణ తీసుకుంటున్నాడు. 2022లో రాష్ట్ర స్థాయిలో మూడు టోర్నీల్లో పాల్గొనగా రెండింటిలో రజత, స్వర్ణ పతకాలు సాధించాడు. 2023లో స్వర్ణ, రజత పతకాలు రెండేసి చొప్పున, ఈ ఏడాది హైదరాబాద్‌లో జరిగిన టోర్నీలో వెండి, మంచిర్యాలలో నిర్వహించిన స్టేట్‌మీట్‌లో బంగారు పతకం సాధించి తనదైన ప్రతిభను చాటాడు. కటా, కుమితే రెండింటిలోనూ నేర్పరి.


ఇష్టంతో..

దివంగత చుక్క ధర్మరాజ్‌తో పూనంచౌదరి

పూనం చౌదరి కరాటేపై ఇష్టంతో ఏడో తరగతిలో శిక్షణ ప్రారంభించింది. ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన ఈ విద్యార్థిని మూడేళ్లుగా తర్ఫీదు పొందుతోంది. స్పైరింగ్‌లో మంచి పట్టు ఉంది. గత ఏడాది బ్లాక్‌బెల్ట్‌ అర్హత సాధించింది. 2022, 2023 సంవత్సరాల్లో మూడు పర్యాయాలు జరిగిన రాష్ట్ర టోర్నీల్లో పాల్గొని ఉత్తమ ప్రదర్శనతో బంగారు పతకాలు కైవసం చేసుకుంది. పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర టోర్నీలో కొద్దిపాటి తేడాతో స్వర్ణపతకం చేజారింది.


చిరుప్రాయం.. జాతీయ స్థాయికి ఎదిగేలా..

మూడో తరగతి చదువుతున్న హర్షవర్ధన్‌ అనతి కాలంలోనే బ్లాక్‌బెల్ట్‌ సాధించడం విశేషం. ఇప్పటి వరకు వివిధ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి టోర్నీల్లో సుమారు 20కిపైగా పాల్గొని ఉత్తమ ప్రతిభతో న్యాయనిర్ణేతలను సైతం ఆకట్టుకున్నాడు. మార్చి 3న హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి అక్టోబరులో గోవాలో జరగబోయే నేషనల్‌కు ఎంపికయ్యాడు.


తండ్రి బాటలోనే..

కుమారుడు నరసింహస్వామికి తర్ఫీదు ఇస్తున్న తండ్రి, శిక్షకుడు అమ్ముల భూషణ్‌

జపాన్‌ కరాటే అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి, శిక్షకుడు అమ్ముల భూషణ్‌ కుమారుడు నరసింహస్వామి తండ్రిబాటలోనే ముందుకెళ్తున్నాడు. కరాటేపై కుమారుడికి ఉన్న మక్కువను గుర్తించి తండ్రి ప్రోత్సహించారు. ప్రస్తుతం అయిదో తరగతి చదువుతున్న ఈ విద్యార్థి అయిదేళ్లుగా తర్ఫీదు పొందుతున్నాడు. ఇప్పటి వరకు 25 రాష్ట్ర పోటీల్లో పాల్గొని గుర్తింపు సాధించాడు. గత ఏడాది నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ రాష్ట్ర టోర్నీలో స్వర్ణం పొంది, డిసెంబరు 16- 19 వరకు దిల్లీలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. కటా, కుమితేలో మంచి నైపుణ్యం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని