logo

గల్ఫ్ బాధితులకు భరోసా కలిగేనా?

ఎడారి దేశాలకు వలసవెళ్లే కార్మికులకు భరోసా కరవైంది. గల్ఫ్‌ దేశాలకు వెళ్లి జేబునిండా డబ్బులతో తిరిగి వద్దామనుకున్న వారిని అనుకోని అవాంతరాలు చుట్టుముడుతున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే దాదాపు 70 వేల మంది గల్ఫ్‌ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌, ఖతార్‌, బెహరాన్‌, ఒమన్‌లకు వెళ్లగా తాజాగా కొత్తతరం కూడా ఎడారి దేశాల బాట పడుతోంది.

Published : 20 Apr 2024 02:30 IST

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ప్రజాప్రతినిధులు, గల్ఫ్‌ ఐకాస నాయకులు

నిర్మల్‌, న్యూస్‌టుడే: ఎడారి దేశాలకు వలసవెళ్లే కార్మికులకు భరోసా కరవైంది. గల్ఫ్‌ దేశాలకు వెళ్లి జేబునిండా డబ్బులతో తిరిగి వద్దామనుకున్న వారిని అనుకోని అవాంతరాలు చుట్టుముడుతున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే దాదాపు 70 వేల మంది గల్ఫ్‌ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌, ఖతార్‌, బెహరాన్‌, ఒమన్‌లకు వెళ్లగా తాజాగా కొత్తతరం కూడా ఎడారి దేశాల బాట పడుతోంది. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని వారే ఆయా దేశాలకు వెళ్తుండటంతో వారంతా భవన నిర్మాణం, వ్యవసాయం వంటి పనుల్లో కుదురుతున్నారు. అక్కడి వాతావరణం, ఆహారం, తదితర పరిస్థితుల కారణంగా మానసిక ఒత్తిడితో అనారోగ్యం, ఆపై మృత్యువాత పడుతున్న వారు కొందరైతే.. క్షణికావేశాలతో చేసే నేరాలతో జైళ్ల పాలవుతున్న వారు మరికొందరు. దీంతో వారి కుటుంబాలకు తీరని శోకం మిగులుతోంది. గల్ఫ్‌ బాధితుల గోస తీర్చాలని మూడు రోజుల క్రితం కాంగ్రెస్‌ పార్టీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గల్ఫ్‌ కార్మిక సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఇందులో నిర్మల్‌ జిల్లాకు చెందిన ప్రవాసిమిత్ర కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్‌ పరికిపండ్ల, గల్ఫ్‌ ఐకాస నాయకులు దొనికెని కృష్ణ, పోతుగంటి సాయెందర్‌, గుండేటి గణేశ్‌లతోపాటు ఇతర జిల్లాలకు చెందిన ప్రతినిధులు గల్ఫ్‌ దేశాల్లో మన ప్రాంతవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గల్ఫ్‌ దేశాల్లో పనిచేస్తున్న వారు ఎదుర్కొంటున్న సమస్యలు తీరుస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యంలో బాధితులు, వారి కుటుంబాలు భరోసా కలుగుతుందనే నమ్మకంతో ఉన్నారు.

ఇవీ కార్మికుల డిమాండ్లు 

  • గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వార్షిక బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించాలి
  • కేరళ తరహాలో ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలి
  • గల్ఫ్‌ మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, జీవిత, ప్రమాద బీమా, పెన్షన్‌లతో కూడిన సమగ్రమైన సాంఘిక భద్రత పథకం అమలు చేయాలి
  • గల్ఫ్‌ జైళ్లలో చిక్కుకున్న వారికి మెరుగైన న్యాయ సహాయం అందించాలి
  • కేంద్రం తరఫున వెంటనే హైదరాబాద్‌లో సౌదీ, యూఏఈ, కువైట్‌ కాన్సులేట్లను ఏర్పాటు చేయాలి
  • గల్ఫ్‌ బాధిత కుటుంబాలకు చెందిన పిల్లల కోసం రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల్లో ప్రత్యేకంగా కొన్ని సీట్లు కేటాయిస్తూ రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించాలి.
  • గల్ఫ్‌లో ఉపాధి పొందుతూ ప్రమాదాల వల్ల ఆరోగ్యం దెబ్బతిన్న వారికి ప్రభుత్వం ద్వారా వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేయాలి. గల్ఫ్‌లో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను తెప్పించడానికి ప్రభుత్వ చొరవ చూపించాలి

పరిస్థితి ఇలా..

  • ఉపాధి కోసం వెళ్లిన వారిలో చాలా మంది సాంకేతిక శిక్షణ, అనుభవం లేనివారే ఉన్నారు.
  • రోజువారీ కూలీలుగా వెళ్లి చాలా ఇబ్బందులు పడేవారు వేలల్లో ఉన్నారు.
  • నకిలీ ఏజెంట్ల మోసాల బారిన పడి రూ. లక్షల్లో మోసపోయిన వారు ఇబ్బందులు పడుతున్నారు.
  • అక్కడి వాతావరణం సరిపడక, ఇక్కడికి రాలేక చాలా మంది ప్రాణాలకు తెగించి ఎడారి దేశాల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు.
  • కార్మికులుగా కంపెనీల్లో పనిచేస్తూ ప్రమాదాలకు గురైనా చాలా చోట్ల కనీసం బీమా చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇక్కట్లు పడుతున్నారు.

సమావేశంలో ఇచ్చిన హామీలివీ..

  • గల్ఫ్‌ బాధితుల కోసం కేరళ తరహాలో ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు  
  • సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో ప్రజాభవన్‌లో ప్రత్యేక కార్యాలయం
  • సెప్టెంబరు 17లోగా గల్ఫ్‌ బాధితుల సంక్షేమం కోసం పకడ్బందీ వ్యవస్థ
  • ః గల్ఫ్‌ దేశాల్లో మృతిచెందిన కార్మికుని కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అమలు

అయిదు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని సీఎం హామీ:

స్వదేశ్‌ పరికిపండ్ల, ప్రవాసి మిత్రరాష్ట్ర అధ్యక్షుడు

గల్ఫ్‌ దేశాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విన్నవించాం. రానున్న అయిదు నెలల్లో గల్ఫ్‌ బాధితుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటుతో గల్ఫ్‌ కార్మికులకు ప్రయోజనం కలుగుతుంది. ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశాలకు వెళ్లేవారికి ముందస్తు అవగాహన కార్యక్రమాలతోపాటు నైపుణ్య శిక్షణ ఇస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని