logo

ఏడుసార్లు ఎంపీ.. రెండుసార్లు ఎమ్మెల్యే

గుడిసెల వెంకటస్వామిగా, కాకాగా గుర్తింపు పొందిన గడ్డం వెంకటస్వామి తెలంగాణ నుంచి అత్యధికంగా ఏడుసార్లు ఎంపీగా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసి సుదీర్ఘకాలం చట్టసభలకు ఎన్నికైన నేతగా పేరు గడించారు.

Published : 24 Apr 2024 07:43 IST

న్యూస్‌టుడే, శ్రీరాంపూర్‌: గుడిసెల వెంకటస్వామిగా, కాకాగా గుర్తింపు పొందిన గడ్డం వెంకటస్వామి తెలంగాణ నుంచి అత్యధికంగా ఏడుసార్లు ఎంపీగా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసి సుదీర్ఘకాలం చట్టసభలకు ఎన్నికైన నేతగా పేరు గడించారు. ఆయన 1957 నుంచి 1962 వరకు తొలిసారి ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. 1967లో నాలుగో లోక్‌సభకు తొలిసారి సిద్దిపేట పార్లమెంటు స్థానం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. సిద్దిపేట పార్లమెంటరీ స్థానంగా అదే ఏడాది ఆవిర్భవించింది. ఇలా ఆయన అక్కడి తొలి ఎంపీగా గుర్తింపు పొందారు. 1971లో రెండోసారి సిద్దిపేట నుంచి ఎంపీగా గెలిచారు. 1973 ఫిబ్రవరి నుంచి 1977 మార్చి వరకు కేంద్ర మంత్రివర్గంలో సహాయ మంత్రిగా పనిచేశారు. అనంతరం ఆయన అనేక పదవులు అలంకరించారు. మూడోసారి 1977లో పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. అనంతరం 1978-84 మధ్య రెండోసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికై, రాష్ట్ర కార్మిక, పౌర సరఫరాల శాఖలో మంత్రిగా పనిచేశారు. పెద్దపల్లి నుంచి నాలుగోసారి 1989లో, 1991లో అయిదోసారి, 1996లో ఆరోసారి, 2004లో ఏడోసారి ఎంపీగా గెలిచారు. 2009లో తన కొడుకు వివేక్‌ వెంకటస్వామికి రాజకీయ భవిష్యత్తు కల్పించడానికి ఎన్నికల బరినుంచి వైదొలిగారు. 2009లో వివేక్‌ వెంకటస్వామి ఎంపీగా గెలువగా, ఆయన తనయుడు వంశీకృష్ణ తన తాత, తండ్రి వారసత్వంతో 2024లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కాంగ్రెస్‌ తరఫున పెద్దపల్లి బరిలో నిలిచారు.

 ఉమ్మడి జిల్లా నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరికి చోటు

 కేంద్ర మంత్రివర్గంలో ఉమ్మడి జిల్లా నుంచి మంత్రులుగా చోటు దక్కించుకున్న ఘనత ఇద్దరికి దక్కింది. తొలి మంత్రిగా కాకా వెంకటస్వామి గుర్తింపు పొందారు. ఆయన తర్వాత కేంద్రంలో చక్రం తిప్పిన ఘనత సముద్రాల వేణుగోపాలాచారిది. 1973 నుంచి 1977లో వెంకటస్వామి తొలుత కార్మిక, పునరావాస శాఖ సహాయ మంత్రిగా దాదాపు పది నెలలు పనిచేసి, ఆ తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో ఆయన సిద్దిపేటకు ప్రాతినిధ్యం వహించారు. 1977లో పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి మూడోసారి ఎన్నికైన తర్వాత 1978 నుంచి 1982 వరకు ఆయన కేంద్ర కార్మిక శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. 1991లో పదో లోక్‌సభకు అయిదోసారి ఎన్నికైన అనంతరం ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా, జౌళి శాఖ, పరిశ్రమల శాఖ మంత్రిగా, కార్మిక మంత్రిగా 1996వరకు పదవులు చేపట్టారు. జిల్లాకు చెందిన సముద్రాల వేణుగోపాలాచారి ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి 1996లో విజయం సాధించిన అనంతరం అదే ఏడాది కేంద్ర విద్యుత్తు శాఖ సహాయ మంత్రిగా, ఆ తర్వాత వ్యవసాయ శాఖ 1998 వరకు పనిచేశారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని