logo

ఇక లెక్క పక్కా!

హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తోంది. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనుంది.

Published : 26 Apr 2024 02:44 IST

గత తప్పిదాలు పునరావృతం కాకుండా ప్రతి మొక్కకు జియోట్యాగింగ్‌
ఈ సారి జిల్లాలో 51.48 లక్షలు పెంపకం

నిర్మల్‌ పట్టణ సమీపంలో గ్రీన్‌ మ్యాట్‌ కింద వివిధ రకాల మొక్కల పెంపకం

నిర్మల్‌, న్యూస్‌టుడే: హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తోంది. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనుంది. ఈ సారి జిల్లాలో 51.48 లక్షల మొక్కల పెంపకం కోసం వివిధ శాఖలకు లక్ష్యాలు కేటాయించారు. ఎండను తట్టుకునేలా మొక్కలపై గ్రీన్‌ మ్యాట్‌లు కప్పి రెండు పూటలా నీరందిస్తూ పెంచుతున్నారు. గ్రామీణాభివృద్ధి, పురపాలిక, అటవీ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నర్సరీలు ఏర్పాటు చేసి ఏటా విత్తనాలు వేసి మొక్కలు పెంచుతున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రామానికొకటి చొప్పున నర్సరీని ఏర్పాటుచేశారు. వాటిల్లో మొక్కలు పెంచుతున్నారు. వర్షాలు కురియగానే ఎదిగిన మొక్కలను ఆయా ప్రాంతాల్లో నాటనున్నారు.

తీగల కింద వద్దు

2016-17 నుంచి గతేడాది వరకు 36,437 ప్రాంతాల్లో సుమారు 2.15 కోట్ల మొక్కలు నాటారు. వీటిని నాటే విషయంలో భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను గుర్తించకపోవడం, కొన్ని ప్రాంతాల్లో సరైన నిర్వహణ లేక లక్ష్యం నెరవేరని పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రధానంగా విద్యుత్తు తీగల కిందే వాటిని ఏర్పాటు చేయడంతో అవి ఏపుగా పెరిగి పైవరకు చేరుకుంటున్నాయి. ఈదురుగాలులు వీచిన సమయంలో తీగలకు తగిలి విద్యుత్తు సరఫరాలో అంతరాయం నెలకొంటోంది. డిస్కం అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా తీగల కింది చెట్లను తొలగించడంతో వారికి జరిమానా విధించిన ఘటన సైతం చోటు చేసుకుంది. వినియోగదారులకు సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా తాము చెట్ల తొలగింపు చేపట్టామని, ముందే చెప్పినా.. తీగల కిందే నాటారని వారు చెబుతున్నారు. మరోవైపు కొన్ని చోట్ల లక్ష్యం పూర్తి చేయడంపై కనబరుస్తున్న శ్రద్ధ వాటి పర్యవేక్షణలో  చూపడం లేదు. ఫలితంగా  మొక్కలు మోడుగా మిగులుతున్నాయి. వచ్చే ఏడాదైనా ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపేలా, పల్లెలు పచ్చదనంతో వెల్లివిరిసేలా శాఖల అధికారులు సమన్వయంతో తగిన కార్యాచరణ రూపొందిస్తే మేలని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు

రక్షణే ప్రధానం

జిల్లాలోని నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ పట్టణాలతో పాటు 18 మండలాలు, 396 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ సారి హరితహారం కార్యక్రమం కింద నాటిన ప్రతి మొక్కకు లెక్క ఉండటానికి జియోట్యాగింగ్‌ వ్యవస్థను పటిష్ఠంగా అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. నాటిన మొక్కలకు రక్షణ కల్పించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మొక్కలు ఎన్ని నాటారు.. వాటిలో ఎన్ని పెరుగుతున్నాయని లెక్క తెలుసుకోనున్నారు. ప్రతి శాఖకు మండలస్థాయి అధికారులకు జియోట్యాగింగ్‌ లాగిన్‌ను సమకూరుస్తారు. దీంతో ఆయా శాఖల్లో ఎన్ని మొక్కలు నాటారు.. ఎన్నింటికి రక్షణ కల్పించారు.. తదితర వివరాలను కంప్యూటర్‌లో నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. నాటిన మొక్కల పరిస్థితులను ప్రతి నెలా అందులో అప్‌డేట్‌ చేయాలి. దీంతో రాష్ట్రంలో ఎక్కడ ఎన్ని మొక్కలు ఉన్నాయనే వివరాలు అందుబాటులో ఉండటంతో ఉన్నతాధికారులు ఎప్పుడైనా తనిఖీలు చేయొచ్చు. దీంతో మొక్కల తప్పుడు లెక్కలకు తెరపడనుంది.

అందరి భాగస్వామ్యంతో...

హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి గ్రామ ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకే ప్రతి గ్రామంలో హరిత రక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తోంది. గ్రామ సర్పంచి, కార్యదర్శి, హరితరక్షణ కమిటీలు, గ్రామ ప్రజలతో పాటు అన్ని శాఖల అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ హరిత రక్షణ కమిటీలకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. మొక్కలు నాటిన తర్వాత సంరక్షణ బాధ్యతలను వారికే అప్పగించనున్నారు. వీటి పర్యవేక్షణకు ప్రతి గ్రామానికి మండలస్థాయి అధికారి, మండలానికి జిల్లాస్థాయి అధికారికి బాధ్యతలు అప్పజెప్పారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు అన్ని శాఖల అధికారులు, ముఖ్యంగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనేలా కార్యక్రమాలు రూపొందించారు. గ్రామాల్లో అవగాహన ర్యాలీలు చేపట్టనున్నారు. మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టిన వారిని ప్రోత్సాహక బహుమతులతో సన్మానించాలనే ఆలోచన చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని