logo

గుంపులున్న చోటుపై గురి..

ఎన్నికల ప్రచారానికి మరో 14 రోజులు మాత్రమే గడువుంది. లోక్‌సభ పరిధిలో రెండు వేలకు పైగా గ్రామాలు, 380కి పైగా గూడేలు, తండాలు ఉన్నాయి.

Published : 28 Apr 2024 03:19 IST

ప్రచారానికి ఇంకా 14 రోజులే
2,111 పోలింగ్‌ కేంద్రాలు.. 16.40 లక్షల మంది ఓటర్లు

గ్రామంలో జరుగుతున్న కార్యక్రమానికి హాజరైన గోడం నగేష్‌

న్యూస్‌టుడే, రాంనగర్‌, ఇచ్చోడ : ఎన్నికల ప్రచారానికి మరో 14 రోజులు మాత్రమే గడువుంది. లోక్‌సభ పరిధిలో రెండు వేలకు పైగా గ్రామాలు, 380కి పైగా గూడేలు, తండాలు ఉన్నాయి. వీటిలో చాలా గ్రామాలకు అభ్యర్థులు వెళ్లలేదు. కొన్ని మండల కేంద్రాలకు కూడా వెళ్లలేదు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రచారం ఊపందుకున్నా.. ప్రతి ఊరికి వెళ్లి.. ఇంటింటికి తిరిగి ఓట్లు వేయాలని అడిగేందుకు సమయం లేదు. పైగా ఎండలు భగ్గుమంటుండటంతో కాలనీల్లో కూడా తిరిగే పరిస్థితి లేదు. జిల్లాలో ఎన్నికల సందడే కనిపించడం లేదు. దీనికి తోడు ఎన్నికల సంఘం కఠిన నిబంధనల కారణంగా గోడల మీద రాతలు.. పోస్టర్లు కూడా కనిపించడం లేదు. ఇంత తక్కువ సమయంలో ఓటర్లను చేరుకునేదేలా.. ఓట్టు రాబట్టుకోవడం ఎలా అంటూ పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు.

వీధి వ్యాపారులతో ఆత్రం సుగుణ

ఇంటింటికి ఓటరును కలిసే అవకాశం లేకపోవడంతో అభ్యర్థులు వివాహాలు, ఇతర ఫంక్షన్లు, ఆలయాలు, తదితర వాటిపై దృష్టి సారించారు. వాళ్లు పిలవకపోయినా.. స్థానిక నేతల అభ్యర్థన మేరకు హాజరై పరోక్షంగా ఓట్లు అడుగుతున్నారు. ఒక చోట గుంపు కనబడితే చాలు.. పలకరించి వెళుతున్నారు. పట్టణాలు, మున్సిపాల్టీల్లో ఉదయం వేళ చాలా మంది స్టేడియంలో వాకింగ్‌ చేస్తుంటారు. తెల్లవారగానే అక్కడికి వెళ్లి వారిని కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గ్రామాల్లో ఏ కార్యక్రమం ఉన్నా.. హాజరవుతున్నారు. కుదరకుంటే తమ ముఖ్య అనుచరులను పంపిస్తున్నారు. గ్రామాల్లో ఎవరు చనిపోయినా.. అక్కడికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. ఆలయాలు తదితర వాటిలో జరిగే కార్యక్రమాలకు వస్తున్నారు.  ఉపాధిహామీ పనులు జరిగే చోట్లకు వెళుతున్నారు. ప్రచారంలో భాగంగా గ్రామాలను చుట్టి వచ్చే అవకాశం లేకపోవడంతో పార్టీలు అభ్యర్థులు, రోడ్‌షోలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇప్పటి వరకు పార్టీలు  ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించలేదు. కాంగ్రెస్‌ తరఫున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో బహిరంగ సభను నిర్వహించారు. భారాస నుంచి కేటీఆర్‌ వచ్చి పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. నామినేషన్ల సమయంలో భాజపా ర్యాలీగా వెళ్లడం మినహా ఇప్పటి వరకు రోడ్‌షోలు నిర్వహించకపోవడంతో సందడి కనిపించడం లేదు. ప్రచారం చివరలో పెద్ద పట్టణాల్లో రోడ్‌షోలు, ర్యాలీలు చేపట్టాలని పార్టీలు భావిస్తున్నాయి.

ఎక్కడి వారు అక్కడే..

పార్లమెంట్‌ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ నియోజకవర్గానికి చెందిన నేతలు అక్కడే ప్రచారం చేసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. పార్టీ తరఫున ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థి నియోజకవర్గాలకు వెళ్లి అక్కడి నేతలతో ప్రచారం చేస్తున్నారు. పార్లమెంట్‌ పరిధి విశాలంగా ఉండటంతో ఒక్కో నియోజకవర్గానికి మూడు రోజులు కేటాయించినా.. ఏడు నియోజకవర్గాల్లోని సగం గ్రామాల్లో కూడా ప్రచారం చేయలేని పరిస్థితి ఉంది. సమయం ఎక్కువగా లేక అభ్యర్థుల గెలుపు బాధ్యతలు ఆయా నియోకవర్గ పార్టీ ఇన్‌ఛార్జిలకే అప్పజెప్పారు. వాళ్లు మండల, గ్రామ స్థాయి నేతలను సమన్వయపర్చుకుంటూ ప్రచారం చేయాలని ఆదేశించారు. ఎండల తీవ్రత కారణంగా పగటి పూట బయటకు వచ్చే పరిస్థితి లేక కేవలం ఉదయం, సాయంత్రం అది కూడా కొన్ని గంటలే ప్రచారం చేస్తుండటంతో ఎన్నికల సందడి లేకుండా పోయింది. గతంలో మాదిరిగా మైకుల హోరు కూడా ఎక్కువగా వినిపించడం లేదు.

వాకర్స్‌ గ్రూప్‌ సభ్యులతో ఆత్రం సక్కు ముచ్చట్లు

ఇంద్రవెల్లి మండలంలోని మామిడిగూడ గ్రామంలో 160 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు గ్రామానికి ఏ పార్టీకి చెందిన నాయకులు రాలేదని గ్రామస్థులు చెబుతున్నారు. నార్నూర్‌ మండలంలోని చిన్నకుండి, గణేశ్‌పూర్‌ తదితర గ్రామాలకు ఇప్పుడు కాదు. గతంలో జరిగిన ఎన్నికల్లో కూడా ఏ పార్టీకి చెందిన నాయకులు రాలేదని వాళ్లు చెబుతున్నారు. పార్టీల వారీగా ఎవరు పోటీ చేస్తున్నారో తెలుసు.. కానీ మా ఓట్లు కావాలని ఎవరు రాలేదు. మాకు ఇష్టమొచ్చిన వారికైతే ఓట్లు వేస్తామని వారు అంటున్నారు. ఇలా నేతలు అడుగుపెట్టని గ్రామాలు ఇంద్రవెల్లి మండలంలోనే 30కి పైగా ఉంటాయి..

ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని తిర్యాణి, పెంబి, సిర్పూరు(యు), లింగాపూర్‌, బెజ్జూరు, తదితర మారుమూల మండలాలకు ఇప్పటి వరకు కొంత మంది అభ్యర్థులు వెళ్లనే లేదు. మండల కేంద్రాలకే వెళ్లలేదంటే అభ్యర్థులు సందర్శించని గ్రామాలు అనేకం ఉంటాయి. ప్రస్తుతానికి ఎక్కువ మంది ఉన్న చోటకు వెళ్తున్నారు. కనీసం మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయా పార్టీ నాయకులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని