logo

మండుటెండల్లో అంటుకుంటున్న అడవులు

జిల్లాలో గతంకంటే ఈ ఏడాది ఎండల తీవ్రత అత్యధికంగా ఉండి ఉదయం పది గంటలకే ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి.

Published : 28 Apr 2024 03:34 IST

ఒక్క నెలలోనే 46 అగ్నిప్రమాదాలు

అడవిలో చెలరేగుతున్న మంటలు

న్యూస్‌టుడే, ఎదులాపురం: జిల్లాలో గతంకంటే ఈ ఏడాది ఎండల తీవ్రత అత్యధికంగా ఉండి ఉదయం పది గంటలకే ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెలలో అత్యధికంగా 43 డిగ్రీల ఎండ తీవ్రత నమోదు కాగా, శనివారం 42.3గా నమోదైంది. ఎండల తీవ్రత కారణంగా వాతావరణ శాఖ జిల్లాను ఆరెంజ్‌ జోన్‌లో ఉందని ప్రకటించి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు సైతం జారీ చేసింది. జిల్లాలోని అడవులపైనా ఈ ప్రభావం కనబడుతోంది. ఈ ఏడాది మొత్తంగా జిల్లాలోని అడవుల్లో 380 అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటే ఈ ఏప్రిల్‌లో 26 రోజుల్లోనే 46 అగ్నిప్రమాదాలు జరిగాయి. జిల్లాలో ఈ ఏడాది జరిగిన అగ్ని ప్రమాదాల్లో 269.49 హెక్టార్లలో అడవులు కాలిపోయాయని అధికారుల అంచనా.

అడవుల్లో జరిగే అగ్నిప్రమాదాలను ఆ శాఖ నవంబరు నుంచి జూన్‌ వరకు ఎనిమిది నెలల కాలానికి లెక్కిస్తుంది. గతేడాదితో పోల్చుకుంటే ఆదిలాబాద్‌ జిల్లా అడవుల్లో ఈ ఏడాది అగ్నిప్రమాదాలు తగ్గినా ఈ ఏప్రిల్‌లో ఎండల తీవ్రత అత్యధికంగా ఉండటంతో కేవలం 26 రోజుల వ్యవధిలో 46 అగ్నిప్రమాదాలు జరిగాయి. ఈ ఏడాది అడపాదడపా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రమాదాల సంఖ్య తగ్గిందని అటవీ అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది జిల్లాలో 653 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గత రెండేళ్లలోనూ ఉట్నూర్‌ డివిజన్‌లోని అడవుల్లోనే ఎక్కువ అగ్నిప్రమాదాలు జరిగాయి. అడవుల్లో అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ఎక్కడ జరిగిందో అధికారులకు సమాచారం వెంటనే వస్తుంది. దీంతో వెంటనే అప్రమత్తమై సంఘటన స్థలానికి వెళ్లి మంటలను ఆర్పివేస్తుంటారు.

ఇలా జరుగుతాయి..

అడవుల్లో అగ్నిప్రమాదాలు వివిధ కారణాల వల్ల చోటు చేసుకుంటుంటాయి. తీవ్రమైన మండుటెండలు ఉన్నప్పుడు ఎండిన చెట్ల కొమ్మలు గాలి వేగానికి ఒకదానికొకటి రాపిడికి గురైన సందర్భాల్లోనూ అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. బాటసారులు కాల్చిన బీడీ ముక్కలు పారేసినప్పుడు, అడవుల సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లో పత్తి కట్టెకు నిప్పుపెట్టినప్పుడు గాలి వల్ల, కొందరు ఇప్ప పువ్వు సేకరణ కోసం ఆ చెట్ల కింద మంట పెట్టడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి.

నష్టాలివీ..

అడవుల్లో అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటే విలువైన సంపద కాలిబూడిదవుతుంది. పక్షులు, జంతువులు వీటి బారిన పడి మృత్యువాత పడే అవకాశాలెక్కువ. విలువైన చెట్లు సైతం బూడిదవుతాయి. అప్పుడే ఎదుగుతున్న మొక్కలు సమూలంగా కాలిపోయి అడవులు అభివృద్ధి కాకుండా పోతాయి.

ఉట్నూరు డివిజన్‌లో అధికం..

జిల్లాలోని అడవుల్లో ఈ ఏడాది 380 అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. జిల్లాలోని ఆదిలాబాద్‌, ఇచ్చోడ డివిజన్‌ల పరిధిలో ప్రమాదాల సంఖ్య తక్కువగా ఉన్నా ఉట్నూర్‌ డివిజన్‌లో అత్యధికంగా చోటుచేసుకున్నాయి. డివిజన్ల వారీగా రెండేళ్లలో జిల్లా అడవుల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాల వివరాలు ఇలా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని