logo

భాజపా బలగాల మోహరింపు

ఉమ్మడి జిల్లా పరిధిలోకి వచ్చే ఆదిలాబాద్‌, పెద్దపల్లి పార్లమెంట్‌ స్థానాలను కైవసం చేసుకునేలా భాజపా కార్యాచరణ చేపట్టింది.

Updated : 28 Apr 2024 06:34 IST

నియోజకవర్గాలవారీగా ఇన్‌ఛార్జులకు బాధ్యతలు
ఈటీవీ - ఆదిలాబాద్‌ 

మ్మడి జిల్లా పరిధిలోకి వచ్చే ఆదిలాబాద్‌, పెద్దపల్లి పార్లమెంట్‌ స్థానాలను కైవసం చేసుకునేలా భాజపా కార్యాచరణ చేపట్టింది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌, భారాసకు దీటుగా ప్రచారం చేయటంపై దృష్టి సారిస్తోంది. ప్రత్యేక బాధ్యతలతో బలగాలను మోహరిస్తోంది. జిల్లాస్థాయిలో పార్టీని సంస్థాగతంగా సమన్వయం చేసేందుకు నియమితులైన ఇన్‌ఛార్జులు ఉన్నా వారి స్థానంలో నియోజకవర్గాలవారీగా ప్రభారీలను ఇప్పటికే నియమించింది. లోక్‌సభ స్థానాల కోఆర్డినేటర్లుగా ఉన్న ఎమ్మెల్యేలను శాసనసభ స్థానాలకు పరిమితం చేసి ఇతర క్రియాశీలక నేతలకు బాధ్యతలను అప్పగించింది. ఆదిలాబాద్‌ లోక్‌సభ కో-ఆర్డినేటర్‌గా ఉన్న ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ స్థానంలో ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌రావును నియమించింది. పెద్దపల్లి కో-ఆర్డినేటర్‌గా ఉన్న ముథోల్‌ ఎమ్మెల్యే రామారావు పటేల్‌ స్థానంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలైన జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ సుహాసినిరెడ్డికి బాధ్యతలను అప్పగించింది. నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం కో- ఆర్డినేటర్‌గా ఉన్న పార్టీ ఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి స్థానంలో జిల్లాకు చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి అమర్‌సింగ్‌ తిలావత్‌కు, మెదక్‌ కో-ఆర్డినేటర్‌గా ఉన్న పాల్వాయి హరీశ్‌బాబు స్థానంలో సంగారెడ్డినేత విష్ణువర్ధన్‌రెడ్డికి భాజపా బాధ్యతలు అప్పగించింది. ఆయా నియోజకవర్గాల పరిధిలో నలుగురు ఎమ్మెల్యేలతో పాటు ప్రభారీల నియామకం ఎంపీ అభ్యర్థుల విజయంలో కీలకపాత్రగా మారింది.

ఎమ్మెల్యేలపై బరువు బాధ్యతలు..

ఆదిలాబాద్‌, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల గెలుపును భాజపా అధిష్ఠానం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానంలో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు ఎవరి నియోజకవర్గం పరిధిలో వారు పార్టీపై పూర్తి శ్రద్ధ  పెట్టేలా అక్కడికే పరిమితం చేయాలని భావిస్తోంది. ఎల్‌పీ నేతగా మహేశ్వర్‌రెడ్డి రాష్ట్రంలో ప్రచారం చేసే వెసులుబాటు ఉన్నా నిర్మల్‌ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించినట్టు తెలిసింది. ఆదిలాబాద్‌ - పాయల్‌ శంకర్‌, సిర్పూర్‌(టి) - పాల్వాయి హరీశ్‌బాబు, ముథోల్‌-రామారావు పటేల్‌ను అందుబాటులో ఉంచి శ్రేణులతో సమన్వయానికి ప్రాధాన్యం ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది. వీరికితోడుగా ప్రభారీలను నియమిచింది. ఆదిలాబాద్‌కు - బద్ధం లింగారెడ్డి(ఆర్మూర్‌), నిర్మల్‌ - మల్లారెడ్డి(మంచిర్యాల), బోథ్‌ - కొంగర సత్యనారాయణ(కాగజ్‌నగర్‌), ఖానాపూర్‌ - నీలం రాజు(కామారెడ్డి), ఆసిఫాబాద్‌ - రాజేందర్‌(గోదావరిఖని), మంచిర్యాల - అనిల్‌రెడ్డి(హుజూరాబాద్‌), బెల్లంపల్లి -సుదర్శన్‌గౌడ్‌(కరీంనగర్‌), చెన్నూరు - క్యాతం వెంకట్రాం(గోదావరిఖని), సిర్పూర్‌ - రాజ్‌మోహన్‌గౌడ్‌(వరంగల్‌)ను నియమించింది.

ఆదిలాబాద్‌కు చెందిన క్రియాశీలక నేత, జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ సుహాసినిరెడ్డిని పెద్దపల్లి లోక్‌సభ కో-ఆర్డినేటర్‌గా పార్టీ నియమించింది. క్షేత్రస్థాయిలో పట్టు కలిగిన ఆమెను ఆదిలాబాద్‌ లోక్‌సభ కో-ఆర్డినేటర్‌ బాధ్యతలను అప్పగించాలనే డిమాండ్‌ పార్టీలో ఉంది. కానీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ వర్గం అభ్యంతరం కారణంగా పెద్దపల్లి ఇన్‌ఛార్జిగా నియమించినట్టు సమాచారం. నిర్మల్‌కు చెందిన అయ్యన్నగారి భూమయ్యను ఆదిలాబాద్‌కు కన్వీనర్‌గా, రావుల రాంనాథ్‌కు బాల్కొండ ప్రభారీగా పంపించటం, ముథోల్‌కు చెందిన సీనియర్‌ నేత మోహన్‌రావు పటేల్‌ను పట్టించుకోకపోవడం తప్పుడు సంకేతంగా నిలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని