logo

‘పది’ ఫలితాల్లో దిగజారి!

పదో తరగతి ఫలితాల్లో జిల్లా మరోసారి వెనుకబడిపోయింది. మంగళవారం విడుదలైన ఫలితాల్లో జిల్లా గతేడాది ఫలితాలతో పోలిస్తే రెండు స్థానాలు దిగజారి 31వ స్థానంలో నిలిచింది.

Published : 01 May 2024 02:53 IST

 83.29 ఉత్తీర్ణత శాతంతో జిల్లాకు 31వ స్థానం.. 
న్యూస్‌టుడే, ఆసిఫాబాద్‌ అర్బన్‌

 పదో తరగతి ఫలితాల్లో జిల్లా మరోసారి వెనుకబడిపోయింది. మంగళవారం విడుదలైన ఫలితాల్లో జిల్లా గతేడాది ఫలితాలతో పోలిస్తే రెండు స్థానాలు దిగజారి 31వ స్థానంలో నిలిచింది. వరుసగా మూడేళ్ల నుంచి జిల్లా 30, 29, 31వ స్థానాలకే పరిమితమవుతుండటంతో.. జిల్లా విద్యాశాఖ అధికారుల్లో అసంతృప్తి నెలకొంది. ఉత్తమ ఫలితాల సాధన కోసం జిల్లా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణను అమలు చేసినప్పటికీ మెరుగైన ఫలితాలు రాకపోవడానికి కారణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. మార్చిలో జరిగిన పదో తరగతి వార్షిక పరీక్షలకు 6,893 మంది హాజరు కాగా 5,325 మంది (83.29శాతం) ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో ఒక్కరికి కూడా 10 జీపీఏ రానప్పటికీ.. ఆరు పాఠశాలలు శత శాతం ఉత్తీర్ణత సాధించడం చెప్పుకోదగ్గ విషయం.

పదో తరగతి ఫలితాల్లో జిల్లా వెనుకంజ వేయడానికి గల కారణాలను అధికారులు, ఉపాధ్యాయులు విశ్లేషించే పనిలో పడ్డారు. డిసెంబరులోనే సిలబస్‌ పూర్తి చేయించి రివిజన్‌తోపాటు జిల్లా విద్యాశాఖ సిద్ధం చేసి ప్రతి రోజూ ఉదయం స్లిప్‌ టెస్టులు, సాయంత్రం స్టడీ అవర్స్‌ నిర్వహించారు. ఏ రోజుకారోజు ఫలితాలను గూగుల్‌ షీట్‌లో నింపారు. విషయ నిపుణులతో అవగాహన కల్పించారు. పరీక్షలంటే భయం పోగొట్టేందుకు వ్యక్తిత్వ వికాస నిపుణులతో ప్రేరణ తరగతులు నిర్వహించారు. అయినప్పటికీ ఫలితాల్లో వెనుకబాటుకు కారణాలను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల గైర్హాజరు ప్రభావం ఫలితాలపై ఉందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతం అధికంగా ఉన్న జిల్లాలో విద్యార్థుల సామాజిక, ఆర్థిక పరిస్థితులు, తల్లిదండ్రుల నిరక్షరాస్యత, మాతృభాషలు వేరుగా ఉన్న విద్యార్థులు ఉండటం వంటి కారణాలు కూడా ఇక్కడి ఫలితాలపై ప్రభావం చూపుతున్నాయని వివరిస్తున్నారు. ఉపాధ్యాయుల కొరత కూడా కొంత ప్రభావాన్ని చూపిందని అభిప్రాయపడుతున్నారు.

ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థులు జి.భావన, ఎస్‌.తిరోజ, ఎం.మనస్విని 9.8 జీపీఏలు సాధించి జిల్లాలోనే ఉత్తమంగా నిలిచారు. ఈ పాఠశాలతోపాటు, జైనూరు ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్థి 9.7 జీపీఏతో ద్వితీయ స్థానంలో ఉన్నారు. కొన్ని పాఠశాలల్లో ఫలితాలు 20-30 శాతం వరకే ఉండటం, చాలా పాఠశాలల్లో 50శాతం లోపు ఫలితాలు ఉండటాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. తక్కువ ఫలితాలు వచ్చిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను వివరణ కోరనున్నట్లు సమాచారం.

బాలికలదే పైచేయి..

జిల్లాలో 3,008 మంది బాలురు పరీక్ష రాయగా.. 2,366 మంది (78.66 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 3,385 మంది బాలికలకు గాను 2,959 మంది (87.42 శాతం) ఉత్తీర్ణతతో  పైచేయి సాధించారు. బాలురుతో పోలిస్తే బాలికల ఉత్తీర్ణత శాతం అధికంగా ఉండటం విశేషం. జిల్లాలోని 80 ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఆశ్రమ, ఆదర్శ, కేజీబీవీ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒక్కరు కూడా 10 జీపీఏ సాధించిన విద్యార్థి లేకపోగా.. 9 జీపీఏ అంతకంటే ఎక్కువ జీపీఏ సాధించిన విద్యార్థులు 36 మంది ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని